Begin typing your search above and press return to search.

ఉత్త‌మ్‌ పై ఢిల్లీకి ఫిర్యాదులు..ఆ ఇద్ద‌రిదే కీల‌క పాత్ర‌

By:  Tupaki Desk   |   11 Nov 2018 5:38 AM GMT
ఉత్త‌మ్‌ పై ఢిల్లీకి ఫిర్యాదులు..ఆ ఇద్ద‌రిదే కీల‌క పాత్ర‌
X
నిన్న మొన్నటిదాకా పొత్తులు గురించి తర్జనభర్జన పడితే..ఇపుడు ఆ పొత్తులపై కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సీటు దక్కని నేతలు...తమ అనుచరగణాన్ని వెంటేసుకుని దండయాత్రలకు దిగుతున్నారు. ఓ వైపు నిరసన దీక్షలు...మరోవైపు ఆమరణదీక్షలు..ఇంకోవైపు ఆత్మహత్యాయత్నాలతో గాంధీభవన్‌ వద్ద సీన్‌ హీటెక్కుతోంది. దీన్ని ఏవిధంగా సద్దుమణిగించాలో తెలియక...హైదరాబాద్‌ మొదలుకుని హస్తిన పెద్దల దాకా తలలు బొప్పికడుతున్నాయి. మ‌రోవైపు అధికార పార్టీని మట్టి కరిపించేందుకు కాంగ్రెస్‌ కూటమిలోని పలు పక్షాలతో ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహా కూటమి వల్ల కాంగ్రెస్‌ లోని చాలా మంది ఆశావాహులకు పార్టీ న్యాయం చేయలేక పోతోంది. అయితే ఆ లోటును ఏ విధంగా భర్తీ చేయాలన్న విషయంపై పార్టీ హైకమాండ్‌ కూడా తీవ్రంగా యోచిస్తోంది. కొంతమంది కీలక నేతలకు మాత్రం నామినేటెడ్‌ పదవులు ఆశ చూపుతున్నారు. అయినప్పటికీ వారిని తట్టుకునే పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

ఇలా స‌ర్దుబాట్ల‌లో బిజీ బిజీగా ఉన్న స‌మ‌యంలో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డిపై పార్టీలోని ఇద్ద‌రు ముఖ్య నేత‌లు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఇద్ద‌రు మిత్ర‌ప‌క్ష నాయకులు ఏకంగా ఢిల్లీ పెద్ద‌ల‌కే త‌మ ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వైఖరి పట్ల ఆ పార్టీ నాయకులు రేవంత్‌ రెడ్డి - విజయశాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ విష‌యాన్ని ఢిల్లీలో రేవంత్ ప‌రోక్షంగా తెలియ‌జెప్పార‌ని - మీడియాకు లీకులు ఇచ్చార‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. కాగా, శనివారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌ కు చేరుకున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పార్క్‌హయత్ హోటల్‌ లో సమావేశమయ్యారు. అదే సమయంలో ఓహ్రీస్ హోటల్‌ లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి - టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ - టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సమావేశమై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమకు కేవలం మూడు సీట్లను కేటాయించి కాంగ్రెస్ అన్యాయం చేస్తున్నదని, దీనిని సహించేదిలేదని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి వాపోయారు. కోదండరాం కూడా కాంగ్రెస్ పెద్దన్న పాత్రలో హుందాగా వ్యవహరించడంలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ లో పట్టు విడుపు లేదని - ఇలాగైతే కలిసిసాగడం కష్టమని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

కాగా, కోదండరాం వెళ్లిపోయిన తరువాత సీపీఐ నాయకులు చాడ వెంకట్‌ రెడ్డి - పల్లా వెంకట్‌ రెడ్డి పార్క్‌హయత్‌ లో కుంతియాతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఉత్తమ్‌ కుమార్ లేకపోవడంపట్ల వారు అసంతృప్తిని వ్యక్తంచేశారు. పీసీసీ అధ్యక్షుడు ఎందుకు ముఖం చాటేశారని వారు కుంతియాను ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో సీట్ల పంచాయ‌తీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ ప‌ద‌వికి ఎస‌రుపెట్టింద‌ని - ఇటు పార్టీలో అస‌మ్మ‌తికి అటు కూట‌మిలో కుంప‌ట్ల‌కు దారితీసింద‌ని అంటున్నారు.