Begin typing your search above and press return to search.

హరిబాబు పని సరా..?

By:  Tupaki Desk   |   16 Jun 2017 7:47 AM GMT
హరిబాబు పని సరా..?
X
ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు విశాఖ భూకుంభకోణం చుట్టూ తిరిగి అక్కడి బీజేపీ ఎంపీ హరిబాబును చిక్కుల్లో పడేసింది. టీడీపీ నేతల ప్రమేయం ఉందంటున్న ఈ కుంభకోణంలో హరిబాబు పాత్రేమీ లేకపోయినా ఆయన ఈ విషయంలో మౌనం దాల్చడం ఆయన్ను విమర్శలపాల్జేస్తోంది.

ఈ భారీ కుంభకోణంపై వైసీపీ - వామపక్షాలతో పాటు బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. ఆ పార్టీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు అయితే దీనిపై ఓపెన్‌ గానే స్టేట్‌ మెంట్లు ఇస్తున్నారు. అయితే లక్ష ఎకరాల కుంభకోణం జరిగినా స్థానిక విశాఖ ఎంపీ హరిబాబు మాత్రం నోరుమెదపడం లేదు. హరిబాబు గెలిచింది బీజేపీ తరపునైనా, అయన ఏపీ బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్నా అందులో చంద్రబాబు చలవ ఉందన్నది బీజేపీ - టీడీపీల్లో వినిపించే మాట. విశాఖలో వైసీపీకి అగ్రనేత విజయమ్మపై గెలవడం నుంచి పదవీ కాలం ముగిసినా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇంకా కొనసాగుతుండడం వెనుక అడుగడుగునా చంద్రబాబు మద్దతు - వ్యూహాలు ఉన్నాయనే అంటారు. ఈ కారణంతోనే హరిబాబు టీడీపీకి తగిలేలా పరోక్షంగా కూడా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని బీజేపీ నేతలే ఆరోపిస్తున్నారు.

అంతేకాదు... హరిబాబు చంద్రబాబుకు ఏజెంటని కూడా ఆరోపిస్తున్నారట. ఆయన చంద్రబాబు మనిషని.. బీజేపీ కంటే చంద్రబాబే ఆయనకు ప్రధమ ప్రాధాన్యమని విమర్శిస్తున్నారు. ఇవి విమర్శలతో ఆగకుండా అధిష్ఠానం వరకు వెళ్లినట్లు సమాచారం. హరిబాబుపై ప్రధాని మోడీ - అమిత్ షాలకు ఇక్కడి నుంచే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు విశాఖ భూకుంభకోణంలో మంత్రి గంటా - టీడీపీ ఎమ్మెల్యేల హస్తం - వాటి పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న మెతక వైఖరి - స్థానిక ఎంపీ హరిబాబు మౌనం తదితర అంశాలపై బీజేపీ నేతలు ఇప్పటికే ఒక నివేదిక సిద్ధం చేశారట. టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే విశాఖ భూకుంభకోణంపై బహిరంగంగా మాట్లాడుతుంటే… స్థానిక ఎంపీ అయి ఉండి హరిబాబు మాట్లాడకపోవడం వల్ల అవినీతి విషయంలో బీజేపీ నిజాయితీపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయంటూ వారు ఢిల్లీ వెళ్లి నివేదిక అందజేసి అమిత్ షా, మోడీలు కంప్లయింటు చేయాలనుకుంటున్నారట. ఈసారి విశాఖ ఎంపీ టిక్కెట్ హరిబాబుకు కేటాయించకూడదని.. తక్షణమే ఏపీ పార్టీ అధ్యక్ష పదవిని వేరేవారితో భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేయబోతున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/