Begin typing your search above and press return to search.

గాంధీ, నెహ్రూ లనంటే ఊరుకుంటారా?

By:  Tupaki Desk   |   6 Sep 2016 4:56 AM GMT
గాంధీ, నెహ్రూ లనంటే ఊరుకుంటారా?
X
ఆప్ నేతలకు ఏమైంది? ఒక పక్క లైంగిక దాడికేసులు మరో పక్క - జాతీయ స్థాయినాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడటం మరో పక్క. ఈ పరిస్థితులకు కేజ్రీ పాడాలి చరమగీతం. అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ మొదలైపోయాయి. తాజాగా తమ పార్టీ నేతల చేష్టలతో ఆప్ ఇరుకున పడుతుంది. ఇప్పటికే ఢిల్లీ మాజీ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సందీప్ కుమార్ కు చెందిన ఓ అభ్యంతరకర వీడియో బయటకు రావడం - బాధితురాలు కూడా ఫిర్యాదు చేయడం.. ఈ విషయాలపై ఆప్ మరో నేత అశుతోష్ మాట్లాడటం - అవి సంచలనమవడం తెలిసిందే.. అయితే ఈయన వ్యాఖ్యలపై తాజాగా కేసులు కూడా నమోదవుతున్నాయి.

శృంగారం మానవ లక్షణం - అందులో తప్పేమీ లేదు అని సందీప్ ను సమర్ధించే ప్రయత్నం చేసిన అశుతోష్.. అక్కడితో ఆగితే బాగుండేది. సహచరుడికి మద్దతు పలికే విషయంలో కాస్త శృతి తప్పి.. జవహార్ లాల్ నెహ్రూ - మహాత్మాగాంధీ లు కూడా ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించారని తెలిపారు! దీంతో ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలపై పెనుదుమారం లేచింది. దీంతో అఖిలేశ్ తివారీ అనే వ్యక్తి ఆయనపై ఫిర్యాదు చేశాడు. గాంధీ - నెహ్రూ వంటి నాయకులపై ఆరోపణలు చేయడం అంటే.. దేశం మొత్తాన్ని అవమానించడమే అని, జాతి మొత్తాన్ని ఇబ్బంది పెట్టడమే అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వ్యవహారం ఇలా చినికి చినికి గాలివానగా మారడంపై ఆప్ కార్యకర్తలు - కేజ్రీ అభిమానులు ఒకింత అసహనంతో ఉన్నారని సమాచారం. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా ముగించాలని, సాగిదీసే దోరణిలో ముందుకుపోరాదని సూచిస్తున్నారట. ఆ పని చేసింది ఒకరే వ్యక్తి - అవసరమైతే ఆయన గురించి సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు కానీ.. ఆయన్ని సమర్ధించే క్రమంలో - ఆయనకు మద్దతిచ్చే ఆలోచనతో జాతీయ నాయకులపై కూడా నిందలు వేయడం మంచి పరిణామం కాదని - ఇది చినికి చినికి గాలివానగా మారి పార్టీపై చెరగని మచ్చలా మిగిలిపోతుందని సూచిస్తున్నారట. ఈ విషయాలపై కేజ్రీ ఎలా స్పందిస్తారో చూడాలి!