Begin typing your search above and press return to search.

అన్ని స్థానాల్లో పోటీ.. మ‌రి అభ్య‌ర్థుల మాటేమిటీ?

By:  Tupaki Desk   |   24 March 2022 12:30 AM GMT
అన్ని స్థానాల్లో పోటీ.. మ‌రి అభ్య‌ర్థుల మాటేమిటీ?
X
ఎన్నిక‌లంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఇక రాజ‌కీయ పార్టీల‌కు అదో జీవ‌న్మ‌ర‌ణ పోరాటం. అన్ని స్థానాల్లో బ‌లమైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి విజ‌యం సాధించ‌డం కోసం పార్టీలు పోరాడ‌తాయి. కానీ ఓ రాష్ట్రంలో ఎక్కువ‌గా ఆద‌ర‌ణ లేని పార్టీలో త‌మ‌కు ప‌ట్టున్న కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రమే అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటాయి.

కానీ తెలంగాణ‌లో అంతంత‌మాత్రంగానే ఉన్న బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటా. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆ పార్టీ రాష్ట్ర స‌మ‌న్వ‌య క‌ర్త ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నారు.

గ‌తంలో బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి సీఎంగా ప‌ని చేసిన యూపీలో.. పార్టీకి అత్యంత ప‌ట్టున్న ఆ రాష్ట్రంలోనే ఈ సారి ఎన్నిక‌ల్లో దారుణ‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. బీఎస్పీని అక్క‌డి ప్ర‌జ‌లు మ‌ర్చిపోయారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ‌లో ఆ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని ఆర్ఎస్ చెప్ప‌డం సాహ‌సం లాంటిదే.

బ‌హుజ‌నుల‌కు రాజ్యాధికారం ద‌క్క‌డ‌మే ల‌క్ష్యంగా ముందుగానే ఆర్ఎస్ త‌న ఐపీఎస్ ప‌ద‌వికి స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ సాంఘిక సంక్షేమ వ‌స‌తి విద్యా సంస్థ‌ల‌ను ఉత్త‌మంగా తీర్చిదిద్దిన వ్య‌క్తిగా ఆయ‌న‌కంటూ ఓ గుర్తింపు ఉంది. అందుకే ఆయ‌న బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీలో చేరే స‌మ‌యంలో ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలియ‌జేశారు.

ప్ర‌వీణ్ కుమార్ చేరిక‌తో రాష్ట్రంలో బీఎస్పీలో జోష్ పెరిగింద‌నేది నిజ‌మే. కానీ మ‌రీ అన్ని స్థానాల్లో పోటీ చేసేంత స్థాయిలో బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఆ పార్టీకి లేర‌నేది కూడా వాస్త‌వ‌మే. స్వేరో అంటూ ప్ర‌వీణ్ కుమార్ తీసుకొచ్చిన విధానం కార‌ణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయ‌న‌కు అనుచ‌ర‌గ‌ణం ఉంది. కానీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అభ్య‌ర్థులు దొరుకుతారా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికీ ఆ పార్టీకి ఆద‌ర‌ణ అంతంత‌మాత్రంగానే ఉంది.

బ‌హుజన రాజ్యాధికార యాత్ర చేస్తున్న ఆర్ఎస్ ముందు పార్టీని బ‌లోపేతం చేసే విష‌యంపై దృష్టి సారించాల‌ని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. ముందుగా పార్టీకి ప‌ట్టున్న ఒక‌టి రెండు స్థానాల్లో పోటీ చేసి అక్క‌డ విజ‌యాలు సాధిస్తే పార్టీకి ఊపు వ‌స్తుంది. అంతే కానీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టి ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంటే జ‌రిగే డ్యామేజీ ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు.