Begin typing your search above and press return to search.

ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పోటీ ... ట్రంప్ సొంత సోషల్ మీడియా

By:  Tupaki Desk   |   21 Oct 2021 11:33 AM GMT
ఫేస్‌బుక్, ట్విట్టర్‌కు పోటీ ... ట్రంప్ సొంత సోషల్ మీడియా
X
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు. ప్రఖ్యాత మైక్రో బ్లాగింగ్ నెట్‌ వర్క్ ట్విట్టర్ తనను శాశ్వతంగా నిషేధించడం, మరో టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ ఫేస్‌ బుక్ తన పోస్టులను తొలగించడం వంటి చర్యల నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. సొంతంగా ఓ సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను ప్రకటించారు. దీని పేరు ట్రూత్ సోషల్ . నవంబర్‌లో ఈ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా నెట్‌వర్కింగ్‌లో అడుగు పెడతారంటూ ఇదివరకే వార్తలు వచ్చాయి. వాటి మీద ఎలాంటి అప్‌ డేట్స్ రాలేదు. తాజాగా ఆయన దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. తాను సోషల్ మీడియా నెట్‌ వర్క్‌ ను నెలకొల్పబోతోన్నట్లు వెల్లడించారు.

ట్రూత్ సోషల్ పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ప్లాట్‌ ఫామ్‌ ను ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) ప్రమోట్ చేస్తుంది. ప్రముఖ కంపెనీలకు చెందిన సోషల్ మీడియా నెట్‌వర్క్‌కు పోటీగా దీన్ని తీసుకుని రాబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే ట్విట్టర్, ఫేస్‌ బుక్ పలుమార్లు షాక్ ఇచ్చాయి. ఆయన అధికారిక అకౌంట్లను బ్లాక్ చేసింది ట్విట్టర్. అలాగే కొన్ని పోస్టులను ఫేస్‌ బుక్ తొలగించింది. అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తమ మార్గదర్శకాలు, నియమ నిబంధనలకు విరుద్ధంగా డొనాల్డ్ ట్రంప్, సమాచారాన్ని పోస్ట్ చేశారనే కారణాన్ని చూపాయి ఈ రెండు సంస్థలు కూడా. ఆయన చేసిన సమాచారం, వీడియోలను తొలగించాయి.

ఈ ఏడాది జనవరిలో వాషింగ్టన్‌లో ఆ దేశ పార్లమెంట్ భవనంపై డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు, సానుభూతిపరులు దాడులు చేసిన అనంతరం, పూర్తిగా ట్రంప్‌ ను సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్ దూరం పెట్టాయి. ట్విట్టర్ అయితే ట్రంప్‌ ను ఏకంగా శాశ్వతంగా నిషేధించింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా నెట్‌ వర్క్‌ ను స్థాపించడంపై దృష్టి పెట్టారు. అధ్యక్ష పదవిని కోల్పోయిన 10 నెలల్లో దానికి రూపకల్పన చేశారు. వచ్చేనెల నుంచి అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ఇదివరకు ఆయన ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జె ట్రంప్ పేరుతో ఓ వెబ్‌ సైట్‌ ను ప్రారంభించారు. అమెరికన్ స్టాక్ మార్కెట్‌లో దీన్ని లిస్టింగ్‌ లోకి తీసుకుని రావడానికి డొనాల్డ్ ట్రంప్, నిర్ణయించారు. ఇదివరకే లిస్టెడ్ అయిన బ్లాంక్ ఛెర్రి కంపెనీ డిజిటల్ అక్విజిషన్ కార్పొరేషన్‌లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్‌ను విలీనం చేయనున్నారు. ప్రస్తుతం ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ వేల్యూ 875 మిలియన్ డాలర్లు. దీనికి అదనంగా మరో 825 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నారు.

ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ ఫాం.. ఓ యాప్‌ ద్వారా యాపిల్‌ బెటా వెర్షన్‌ గా నవంబర్‌ లో ఆహ్వానించబడిన అతిథులు ద్వారా ట్రయల్ కోసం అందుబాటులో ఉంటుంది. 2022 మొదటి త్రైమాసికంలో కంపెనీ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టీఎంటీజీని పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీగా మార్చడానికి ట్రంప్ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్ బ్లాంక్ చెక్ కంపెనీ డిజిటల్ అక్విజిషన్ కార్ప్‌తో విలీనం అవుతుంది. తాను సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను ఎందుకు ప్రారంభించాలనే విషయాన్ని ట్రంప్ వివరించారు. కరడుగట్టిన మత ఛాందసవాదులైన తాలిబన్లు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్నారని, అదే సమయంలో ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉంటోన్న నాయకుడు మౌనంగా ఉంటున్నారని జో బైడెన్‌ నుంచి ఉద్దేశించి విమర్శించారు. అందుకే, తాను గళం విప్పాల్సి వస్తోందని వెల్లడించారు.