Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో 2 కొత్త జట్లను సొంతం చేసుకున్న కంపెనీల బ్యాక్ గ్రౌండ్ ఇదే

By:  Tupaki Desk   |   26 Oct 2021 4:14 AM GMT
ఐపీఎల్ లో  2 కొత్త జట్లను సొంతం చేసుకున్న కంపెనీల బ్యాక్ గ్రౌండ్ ఇదే
X
ఐపీఎల్ టోర్నీలో పాల్గొనేందుకు రెండు కొత్త జట్లను వేలం వేస్తున్నట్లుగా ప్రకటించటం.. ఈ రెండు జట్లను సొంతం చేసుకోవటం కోసం కొమ్ములు తిరిగిన మొనగాళ్లు లాంటి కంపెనీలు ఆసక్తిని చూపించటం.. అందులో అదానీ గ్రూపు ఉండటంతో.. అహ్మదాబాద్ బిడ్ ఆ సంస్థ ఖాతాలోకి వెళుతుందన్న అంచనాలు జోరుగా వినిపించాయి. అందుకు భిన్నంగా.. సాదాసీదా ప్రజలకు పెద్దగా పరిచయం లేని రెండు కంపెనీలు తాజాగా కొత్త జట్లను సొంతం చేసుకోవటం విశేషంగా చెప్పాలి.

తాజా వేలంలో అత్యధికంగా అమ్ముడైన లక్నో ఫ్రాంచైజీని ఆర్పీఎస్జీ గ్రూపు రూ.7090 కోట్లకు సొంతం చేసుకుంటే.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ (ఇరెలియా కంపెనీ ప్రైవేటు లిమిటెడ్) సంస్థ రూ.5625 కోట్లను వెచ్చింది సొంతం చేసుకుంది. ఫ్రాంచైజీని సొంతం చేసుకోవటానికి బీసీసీఐ కనీస బిడ్ గా రూ.2వేల కోట్లను నిర్ణయింస్తే.. అందుకు ఆర్పీఎస్జీ 350 శాతం.. సీవీసీ 250 శాతం అధికంగా బిడ్ వేసి సొంతం చేసుకోవటం ఆసక్తికరంగా మారాయి.

ఇంతకీ ఈ రెండు సంస్థలు చేసే వ్యాపారం ఏమిటి? వాటి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? తాజాగా కొత్త ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్న నేపథ్యంలో వారికున్న అంచనాలు ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే.. కొత్త ముచ్చట్లు తెలుస్తాయి. లక్నో ప్రాంచైజీని సొంతం చేసుకున్న ఆర్పీఎస్ జీ గ్రూప్ కు మొదట్నించి క్రీడలంటే ఆసక్తి. అందులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుంటుంది.సంజీవ్ గోయెంకాకుచెందిన ఈ గ్రూపు ఇండియన్ సూపర్ లీగ్ లో ఆడే ప్రముఖ ఏటీకే మోహన్ బగాన్ ఫుట్ బాల్ క్లబ్ కు ప్రధాన యజమాని ఈ కంపెనీనే కావటం గమనార్హం.

అంతేకాదు.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ పై రెండేళ్లు నిషేధం అమల్లో ఉన్న వేళలో ఆడిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ యజమాని కూడా ఈ సంస్థనే. 2016, 2017 సీజన్లలో ఈ జట్టు ఐపీఎల్ లో ఆడింది. ఇలా ఐపీఎల్ తో రిలేషన్ ఉన్న జట్టు.. లక్నో టీంను సొంతం చేసుకుంది. కొత్త ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన వేళ సంజీవ్ గోయెంకా స్పందిస్తూ.. తాము కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ విలువ వచ్చే పదేళ్లలో మేం పెట్టిన పెట్టుబడి కంటే ఎన్నోరెట్లు పెరుగుతుందని నమ్మాం. కొంతకాలంగా జట్టును సొంతం చేసుకోవాలని భావిస్తున్నామని.. ఇప్పుడు అవకాశం లభించిందని పేర్కొన్నారు.

అహ్మాదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న సీవీసీ క్యాపిటల్ పార్టన్స్ కూడా క్రీడలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. క్రీడలకు ప్రచారం కల్పించే వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ.. తాజాగా ఐపీఎల్ లో కీలకమైన అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకునే ప్రక్రియలో.. దేశంలో మొనగాడు పారిశ్రామిక గ్రూపుగా అభివర్ణించే అదానీ గ్రూపును అధిగమించి ఐపీఎల్ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవటం అందరిని కన్ను వీరిపై పడేలా చేస్తోంది.

ఐరోపా.. ఆసియా ఖండాల్లోని వివిధ ఆటల్లో ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. వాలీబాల్.. రగ్బీ యూనియన్స్.. ఫార్ములా వన్.. మోటో జీపీకి ప్రచారం కోసం పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ 1998లో మోటో జీపీ బ్రాండ్ డోర్నాను కొనుగోలు చేసి కేవలం ఎనిమిదేళ్లలో అంటే 2006లో 700 శాతం లాభానికి అమ్మేసింది. ఫార్ములా వన్ సర్క్యూట్ లో.. రగ్బీలోనూ పెద్ద మొత్తంలో పెట్టుబడుల్ని పెట్టింది.