Begin typing your search above and press return to search.

సామాన్యుడికి ఒళ్లు మండుతుంది ఎందుకంటే..?

By:  Tupaki Desk   |   20 Nov 2016 5:13 AM GMT
సామాన్యుడికి ఒళ్లు మండుతుంది ఎందుకంటే..?
X
నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకొని ఇవాల్టికి 13వ రోజు. ఈ సంచలన నిర్ణయంతో ప్రజలకు ఇబ్బందులన్న విషయం తెలిసినా.. ఆ ఇబ్బందులు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయం మాత్రం గడిచిన వారం రోజులుగా ప్రజలకు అనుభవంలోకి వస్తోంది. రోజులు గడిచే కొద్దీ పరిస్థితుల్లో మార్పులు వస్తాయని అందరూ భావించినా అందుకు భిన్నంగా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం.

ఎవరు అవునన్నా.. కాదన్నా.. ప్రధాని తీసుకున్న సంచలన నిర్ణయానికి సామాన్యుడి మద్దుతు వంద శాతం ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. మారిన మైండ్ సెట్ తో.. రద్దు నిర్ణయం తమకు ఇబ్బందిని కలిగించినా.. మొత్తంగా ఎంతోకొంత ప్రయోజనం కలిగిస్తుందన్న భావన దేశంలోని మెజార్టీ ప్రజల్లో ఉందనటంలో సందేహం లేదు. మోడీ తీసుకున్న రద్దు నిర్ణయంపై పూర్తిస్థాయిలో పాజిటివ్ గా ఉన్న సామాన్యుడికి ఈ మధ్యన ఎందుకు ఒళ్లు మండుతోంది? నిన్నమొన్నటి వరకూ ఓపిగ్గా ఉన్న వారు.. ఇప్పుడిప్పుడే ఎందుకు చిరాకు పడిపోతున్నారు? మోడీ నిర్ణయంపై ఎందుకు పెదవి విరుస్తున్నారు? కోపంగా కాదుకానీ.. మరీ ఇన్ని తిప్పలా? అని ఎందుకు ప్రశ్నిస్తున్నారు లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే.. తప్పులు ఎక్కడ దొర్లుతున్నాయన్న విషయం తేలటమే కాదు.. సామాన్యుడి ఆగ్రహానికి కారణం తెలిసిపోతోంది.

నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుడికి కేంద్రం కల్పించిన సదుపాయాన్ని స్థూలంగా చూస్తే..

1. నగదు మార్పిడి రూ.3వేలు (తర్వాత రూ.4500లకు పెంచి.. ఈ మధ్యనే దాన్ని రూ.2వేలకు కుదించారు)

2. ఏటీఎంలలో విత్ డ్రా చేసుకునే సౌకర్యం

3. చెక్కుల ద్వారా తమ ఖతాల నుంచి వారానికి గరిష్ఠంగా రూ.24వేలు విత్ డ్రా చేసుకునే వీలు

కేంద్రం ప్రకటించిన ఈ మూడు అంశాల్ని.. చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసినా.. ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. మొదటి దాని విషయానికి వస్తే.. నగదు మార్పిడి అంటే.. సామాన్యుడు తన దగ్గరున్న పెద్దనోట్లలో కేవలం రూ.3వేల మొత్తాన్ని చిల్లరగా మార్చుకునే వీలుంది. అది కూడా డిసెంబరు 30 లోపు ఒకే ఒక్కసారి మాత్రమే. ఈ పరిమితిని కూడా సామాన్యుడు అర్థం చేసుకొని మౌనంగా ఉన్నాడు. కానీ.. ఏటీఎంలలో విత్ డ్రా చేసుకునే సౌకర్యం లేకపోవటం.. 13 రోజులుగా ఏటీఎం సెంటర్లు కాస్తా.. ఏనీ టైం మూతపడిన సెంటర్లుగా మారిపోవటం తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారు.

ఈ విషయంలో సామాన్యుడి చిరాకు.. అసంతృప్తి రోజు గడిచేకొద్దీ అంతకంతకూ పెరుగుతుందే కానీ తగ్గ‌టం లేదు. ఏటీఎంల పనితీరు ఎప్పటికి మారుతుందన్న ప్రశ్నకు ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇదో పిద్ద సమస్య అయితే.. కేంద్రం కల్పించిన అతి పెద్ద రిలీఫ్ గా చెప్పే.. చెక్కు ద్వారా నగదు విత్ డ్రా విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారు. వారానికి గరిష్ఠంగా రూ.24వేలు డ్రా చేసుకునే వీలు ఉందని చెబుతున్నా.. బ్యాంకులు తమ దగ్గర డబ్బులు లేవని.. రూ.2 వేల నుంచి రూ.4వేల వరకు మాత్రమే ఇవ్వటం.. దీనికి సంబంధించి బ్యాంకుల్లోకి వచ్చిన వారికి స్పష్టంగా చెప్పటంతో కంగుతింటున్నారు.

మోడీ నిర్ణయాన్ని మెచ్చిన వారు సైతం.. అవసరానికి బ్యాంకుకు వచ్చినప్పుడు బ్యాంకర్లు చెబుతున్న మాటకు నోట మాట రాని పరిస్థితి. ఇదే సామాన్యుడికి కడుపు మండేలా చేస్తోంది. దీంతో పరిస్థితి ఎలా తయారైందంటే.. బ్యాంకుల నుంచి వీలైనంతగా విత్ డ్రా చేసుకోవటమే కాదు.. గతంలో మాదిరి తిరిగి డిపాజిట్ చేసే ధోరణి అస్సలు కనిపించటం లేదు. పాత నోట్లను డిపాజిట్ చేసే వారే కానీ.. కొత్త నోట్లు.. చిల్లర నోట్లను డిపాజిట్ చేసే వారు తగ్గిపోవటంతో బ్యాంకుల వద్ద ఉన్న నగదు తగ్గిపోతూ.. తీవ్ర కొరతను ఎదుర్కొంటున్న పరిస్థితి. బ్యాంకుల సంగతి ఎలా ఉన్నా.. సామాన్యుడికి మండుతున్న వైనంపై కేంద్రం తగురీతిలో చర్యలు తీసుకొని ‘‘మంట’’ను చల్లార్చకుంటే లేనిపోని సమస్యలు షురూ కావటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/