Begin typing your search above and press return to search.

మాటల్లో మేజిక్ చేసే కేసీఆర్.. చేతల్లో ఇలా దొరికిపోతారేంటి?

By:  Tupaki Desk   |   6 Aug 2021 4:00 AM GMT
మాటల్లో మేజిక్ చేసే కేసీఆర్.. చేతల్లో ఇలా దొరికిపోతారేంటి?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల మాయాజాలం ఎంతలా ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవసరానికి.. పరిస్థితులకు అనుగుణంగా.. తన లైన్ కు తగ్గట్లు ఆయన మాటలు ఉంటాయి. అప్పటివరకు తిట్టిన వ్యక్తిని పొగడాలన్నా.. అప్పటివరకు ఆకాశానికి ఎత్తేసిన వారిని పాతాళానికి తొక్కేయాలన్నా.. ఆయన మాటల ఆయుధం ఒక్కటి సరిపోతుంది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం కావటంతో.. ఆ గండం నుంచి గట్టెక్కేందుకు వీలుగా తెలంగాణ దళితబంధు అనే కార్యక్రమాన్ని తెర మీదకు తీసుకొచ్చారన్న విమర్శ వినిపిస్తోంది. సామాజికంగా వెనుకబడిని వారికి రూ.10లక్షలు వారి బ్యాంకు అకౌంట్లలో వేసే ఈ పథకంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

సమాజంలో వివక్ష కు గురైన వారిని ఆదుకోవాల్సిందే. కానీ.. రూ.10లక్షల భారీ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో వేసేయటం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఏవైనా సరే.. సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని పప్పు బెల్లాల మాదిరి పంచిపెట్టటం సరికాదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాను తీసుకొచ్చిన దళిత బంధు కార్యక్రమాన్ని తొలుత అనుకున్నట్లుగా హుజూరాబాద్ లో కాకుండా తాను ప్రత్యేక శ్రద్ధ చూపే వాసాలమర్రి ఊళ్లో షురూ చేస్తున్న సంగతి తెలిసిందే.

సీఎం కేసీఆర్ చెప్పినట్లే.. గురువారం దళిత బంధు లబ్థిదారుల బ్యాంకు ఖాతాలో రూ.10లక్షలు జమ అయ్యాయి. ఈ పథకం అమలుకు సంబంధించిన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరయ్యేందుకు గులాబీ బాస్ వాసాల మర్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు ఆసక్తికరంగా మారింది. తన మాటలతో ఎలాంటి వారినైనా సరే.. మెస్మరేజ్ చేయటం కేసీఆర్ కున్న టాలెంట్. వాసాలమర్రికి వెళ్లిన ఆయన.. గతంలో తనతో పాటు సహపంక్తిలో కూర్చొని భోజనం చేసిన ‘ఆగవ్వ’ ఇంటికి ప్రత్యేకంగా వెళ్లారు. ఆమెతో మాట్లాడారు?

ఎలా ఉన్నావని కుశల ప్రశ్న వేసిన కేసీఆర్.. ఏం కూర వండినావ్? నాకు పెడతావా? అంటూ అడిగి అందరిని ఆశ్చర్యపరిచారు. కేసీఆర్ మాటలకు స్పందించిన ఆగవ్వ..‘టమోటా కూర వండినా సారూ’ అని చెప్పింది. దీనికి బదులిచ్చిన కేసీఆర్.. పద సర్పంచ్ ఇంటికి వెళ్లి అక్కడ భోజనం చేద్దామన్నారు. అన్నట్లే ఆగవ్వను కూడా సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లారు కానీ.. ఆగవ్వ వండిన టమోటా కూర మాత్రం వడ్డించలేదు.. కేసీఆర్ తినలేదని చెబుతున్నారు. ఇక.. ఆయన చుట్టూనే ఉండి.. జరుగుతున్నదంతా చూసిన వారు మాత్రం.. కేసీఆరా మజాకానా?అన్న వ్యాఖ్యలు చేసుకోవటం కనిపించింది. మాటలతో మేజిక్ చేసే ఆయన.. చేతల వద్దకు వచ్చేసరికి మాత్రం లెక్క వేరుగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.