Begin typing your search above and press return to search.

బాబు మాట వినరా... ?

By:  Tupaki Desk   |   16 Oct 2021 10:43 AM GMT
బాబు మాట వినరా... ?
X
చంద్రబాబు ఎన్టీయార్ కాలం నుంచి టీడీపీని నడిపిస్తున్నారు. ఒక విధంగా టీడీపీ వ్యవస్థీకృతమైంది అంటే అది బాబు చలవే అని అంతా ఒప్పుకుంటారు. తెలుగుదేశం పార్టీని గత పాతికేళ్ళుగా తన భుజస్కందాల మీద బాబు మోస్తున్నారు. చంద్రబాబుకు ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాలూ కరతళామల‌కమే. అలాంటిది పదమూడు జిల్లాల ఏపీలో ఎవరేంటి అన్నది ఆయనకు తెలియక కాదు, ఇవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం పార్టీలో కొన్ని నియోజకవర్గాల ఇంచార్జిలను బాబు తాజాగా మార్చారు. తనదైన శైలిలో పాతవారి పనితీరుని అంచనా వేసిన బాబు కొత్త వారికి అవకాశాలు ఆయా చోట్ల ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలి అంటే బాబు సాహసించారనే అనుకోవాలి. అలా ఉత్తరాంధ్రా జిల్లాలలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. విజయనగరం జిల్లా సాలూరులో గుమ్మడి సంధ్యారాణీని టీడీపీ ఇంచార్జిని చేశారు. అదే టైమ్ లో మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ ని పక్కన పెట్టారు. దాంతో ఆయన వర్గీయులు గుర్రు మీద ఉన్నారు.

అసలే సాలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్నదొరకు కీలకమైన స్థావరం. బలమైన నియోజకవర్గం. అలాంటి చోట కలసి పోరాడాల్సిన తమ్ముళ్ళు ఇంచార్జి దగ్గరే వివాదాలు పడితే ఎలా అన్నది ఒక ప్రశ్నగా ఉంది. అయినా సరే భంజ్ దేవ్ సంధ్యారాణి నాయకత్వాన పార్టీ మీటింగులకు హారవుతున్నారు. ముందు ముందు ఈ కధ ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. ఇంకో వైపు చూస్తే విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలో కూడా బాబు మార్పు చేశారు. బలమైన నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుని పక్కన పెట్టి కొత్తగా పార్టీలోకి వచ్చిన పీవీజీ కుమార్ కి చాన్స్ ఇచ్చారు.

దాంతో రామానాయుడు వర్గం రగిలిపోతోంది. తమ నాయకుడు దశాబ్ద కాలం పైగా పార్టీ కోసం కష్టపడుతూ వచ్చారని, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కూడా చేశారని, అలాంటి నేతను పక్కన పెడతారా అని తమ్ముళ్ళు ఏకంగా టీడీపీ అధినాయకత్వం మీదనే కారాలూ మిరియాలూ నూరుతున్నారు. తాజాగా మాడుగులలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ నాయకులు అంతా సమావేశమై మళ్లీ గవిరెడ్డికే ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలని తీర్మానం చేశారు. ఒక విధంగా ఇది తెలుగుదేశం పార్టీ విధానాలకే విరుద్ధమని చెప్పాలి.

పార్టీ అధినేతగా చంద్రబాబు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎవరైనా తలొగ్గాల్సిందే. అలాంటిది ఇపుడు ఇంచార్జి వివాదం మీద పార్టీ లైన్ దాటి తమ్ముళ్ళు మాట్లాడడం పూర్తిగా క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తుంది అంటున్నారు. మరో వైపు చూస్తే పీవీజీ కుమార్ పార్టీలో కొత్తగా చేరారని, ఆయనకు బలం లేదని బాబు నిర్ణయాన్నే తప్పు పడుతున్నారు. మరి ఈ టైమ్ లో చంద్రబాబు ఏం చేస్తారు అన్నది చూడాలి. ఆయన కనుక తలచుకుంటే యాక్షన్ సీరియస్ గానే ఉంటుంది అని కొత్త ఇంచార్జి వర్గీయులు అంటున్నారు. మరి చంద్రబాబు ఈ సాహసం చేస్తారా, తమ్ముళ్ళను బుజ్జగిస్తారా చూడాలి. అసలు ఇంతకీ తమ్ముళ్ళు మాట వింటారా.