Begin typing your search above and press return to search.

కూలోడికి ఎక్కువ.. ముఠామేస్త్రి కి తక్కువ

By:  Tupaki Desk   |   16 Aug 2019 11:56 AM IST
కూలోడికి ఎక్కువ.. ముఠామేస్త్రి కి తక్కువ
X
గంటల కొద్దీ మాట్లాడాల్సిన అవసరం లేదు. చెప్పే ఒక్క మాట అయినా సూటిగా ఉంటే సరిపోతుంది. రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి పెద్ద ఎత్తున డైలాగులు చెప్పే తీరుకు భిన్నంగా.. ఘాటు పంచ్ వ్యాఖ్యలతో దిమ్మ తిరిగేలా చేస్తున్నారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్ వీబీసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయన.. టీడీపీ నేతల్ని విమర్శించే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరని చెప్పాలి.

తాజాగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య చేశారు. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే అచ్చెన్నాయుడు కూలీకి ఎక్కువ.. ముఠామేస్త్రి కి తక్కువంటూ మండిపడ్డారు. టీడీపీకి చెందిన మరో నేత వర్ల రామయ్య నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారని.. ఆయనకు బాబును భజన చేయటమే సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా వర్ల రామయ్యకు సంబంధించిన ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ.. గతంలో పదవి ఇవ్వనందుకు భోరున ఏడ్చేసిన విషయాన్నిమర్చిపోయారా? అని ప్రశ్నించారు.

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ కనీసం శుభాకాంక్షలు కూడా తెలపలేదన్న మాటను మరోసారి ప్రస్తావించారు. జగన్ సీఎం అయితే.. తెలుగు చిత్ర పరిశ్రమ రియాక్ట్ కాలేదంటూ పృథ్వీరాజ్ వ్యాఖ్యలు చేయటం గతంలోనే కలకలాన్ని రేపింది. దీనిపై సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ.. జగన్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కలవాలా? సినిమా వాళ్లేమైనా వ్యాపారస్తులా? అంటూ వ్యంగ్య వ్యాఖ్యలుచేయటాన్ని తప్పు పట్టారు.

ముఖ్యమంత్రిని కలిసే వాళ్లు కలుస్తున్నారని.. కలవని వాళ్లు కలవటం లేదని.. అదంతా వారి విజ్ఞతకు వదిలేస్తున్నట్లుగా చెప్పారు. బాబు మాదిరి హడావుడి.. ఆడంబరాలు జగన్ లో కనిపించవని.. మనిషి చాలా సింఫుల్ గా ఉంటారన్నారు. ఎప్పటిలానే జగన్ పాలనను ఆకాశానికి ఎత్తేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.