Begin typing your search above and press return to search.

అప్పుడు జై జగన్.. ఇప్పుడు జై పవన్: మారిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ!

By:  Tupaki Desk   |   15 Jun 2022 9:10 AM GMT
అప్పుడు జై జగన్.. ఇప్పుడు జై పవన్: మారిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ!
X
ప్రముఖ కమెడియన్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన నేతలపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అంతేకాకుండా అమరావతి రైతుల ఉద్యమంపై పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ లాంటి వారు పృథ్వీరాజ్ ఒక వెధవ అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయినా సరే పృథ్వీ ఎక్కడా తగ్గలేదు. జై జగన్ అంటూ వైఎస్సార్సీపీ విజయానికి తన వంతు కృషి చేశారు.

ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో పృథ్వీకి శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఆ పదవిలో ఉంటూ తిరుమలలో మంచి దర్జా అనుభవించారు.. పృథ్వీ. ఆ తర్వాత ఒక మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ.. ఆమెతో అసభ్యంగా మాట్లాడారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

ఇందుకు సంబంధించి ఆడియోలు వైరల్ గా మారాయి. అయితే పృథ్వీ దీన్ని ఖండించారు. తనపై సొంత పార్టీలో వాళ్లే రాజకీయం చేస్తున్నారని.. తన తప్పు ఏమీ లేకపోయినా బలి చేయడానికి చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే మహిళతో అసభ్యంగా మాట్లాడాటంటూ పృథ్వీని వైఎస్సార్సీపీ అధిష్టానం ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తప్పించింది

అప్పటి నుంచి పృథ్వీని వైఎస్సార్సీపీలో పట్టించుకున్నవారు లేరు. మరోవైపు వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు చేసిన అతికి సినిమా రంగం నుంచి కూడా అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో తప్పు తెలుసుకున్న పృథ్వీ క్షమాపణ చెప్పారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకునే తాను సినిమాలకు వచ్చానని.. మెగా కుటుంబం అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. రాజకీయంగా ఎవరి గురించైనా మాట్లాడి ఉంటే అందుకు క్షమాపణలు తెలుపుతున్నానన్నారు. ప్రస్తుతం పృథ్వీ సినిమాల్లో నటిస్తున్నారు.

మరోవైపు జనసేన పార్టీలో పృథ్వీ చేరతారని వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ మంచి నాయకుడని, ప్రజల కోసం కష్టపడే నాయకుడని, ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని పలు యూట్యూబ్, టీవీ ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు.

ఈ సారి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో సంచలన ఫలితాలు సాధిస్తుందని.. పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ అవుతారని, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని పృథ్వీ ఢంకా బజాయించి చెబుతుండటం విశేషం. 2019లో జై జగన్ అన్న పృథ్వీ ప్రస్తుతం జై పవన్ అంటూ ఆయన బాట పట్టారు. మరికొద్ది రోజుల్లో ఆయన జనసేనలో చేరే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.