Begin typing your search above and press return to search.

జనసేనలో ఆలీ..కామెడీ కాదు...

By:  Tupaki Desk   |   21 Sept 2018 2:13 PM IST
జనసేనలో ఆలీ..కామెడీ కాదు...
X
ఆయన వెండితెరపై కనిపిస్తే నవ్వుల పువ్వులు. తన నటనతో ప్రేక్షకులను సమ్మోహనం చేసే నటుడాయన. అంతే కాదు... నిజ జీవితంలో కూడా కమెడియన్‌ లా కాకుండా హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు. ఆయన ఎవరనుకుంటున్నారా.... ఇంకెవరు... ఆలీ. అవునే ఆలీయే. ఆయన సినీ జీవితం గురించి తెలిసిన వారికి నిజ జీవితంలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదు. తన కోసం తన తండ్రి పడిన కష్టాన్ని కళ్లారా చూసిన ఆలీ తన సంపాదనలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం ఓ ట్రస్ట్‌ నే ఏర్పాటు చేశారు. దాని ద్వారా తన జన్మభూమి రాజమహేంద్రవరంలో ఇటీవల అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదంతా నిన్నటి వరకూ ఆలీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు. అయితే ఇప్పుడు వీటికి రాజకీయ రంగు కూడా తీసుకురావాలని అనుకుంటున్నారట ఆలీ. ఇందుకోసం ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మొన్నటి వరకూ కాస్త సస్పెన్స్‌ గానే ఉంది. అయితే ఇప్పడిప్నుడే ఆ నీలి నీడలకు తెర పడుతోంది. ఈ ఆలీబాబా ఇప్పుడు తన సినీ స్నేహితుడు పవన్ కల్యాణ్ పార్టీ జన సేన నుంచి పోటీ చేయాలని భాతవిస్తున్నట్లు చెబుతున్నారు.

గతంలో కమెడియన్ ఆలీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఈ సారి ఆయన రాజమహేంద్రవరం నుంచి జనసేన తరఫున పోటీ చేయాలనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు ఆలీ విలేకరులతో మాట్లాడుతూ తనకు సినీ రంగంలో అత్యంత ఆప్తుడైన పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ పెడితే అందులో చేరి తాను కూడా ప్రజాక్షేత్రంలో నిలబడతానని ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆలీ తన సినీ స్నేహితుడు - జనసైనికుడు పవన్ కల్యాణ్ పార్టీలో చేరి రాజమహేంద్రవరం నుంచి శాసనసభకు పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. తాజాగా నెల్లూరు జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమైన రొట్టెల పండుగలో పాల్గొనేందుకు వెళ్లిన పవన్ కల్యాణ్ తో పాటు ఆలీ కూడా నెల్లూరు వెళ్లారు. వీరిద్దరి ప్రయాణం రాజకీయంగా కూడా కొనసాగుతుందని అంటున్నారు. ఈ నెల్లూరు పర్యటనే ఆలీ రాజకీయ ప్రవేశానికి నాందీ వాచకమని అంటున్నారు. ఇక్కడి నుంచే ఆలీ జన సైనికునిగా తన ప్రస్ధానం ప్రారంభించే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తానికి తెలుగు సినీ రంగం నుంచి మరో కమెడియన్ తెలుగు రాజకీయ అరంగ్రేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.