Begin typing your search above and press return to search.

అంటే అలీకి తొంద‌రెక్కువ !

By:  Tupaki Desk   |   15 Jun 2022 8:00 AM IST
అంటే అలీకి తొంద‌రెక్కువ !
X
రాజ‌కీయాల్లో రావాల‌ని, పద‌వులు వ‌రించాల‌ని అనుకోవ‌డంలో త‌ప్పు లేదు కానీ అదే ప‌నిగా భ‌జ‌న చేస్తేనే విన్న చెవుల‌కు ఇబ్బంది. చూసిన క‌ళ్ల‌కూ ఇబ్బందే! అయినా కళ్లూ, ముక్కూ, చెవులూ ఏవీ కూడా అతిని భ‌రించ‌లేవు. జ్ఞానేంద్రియాలు క‌దా ! కాస్త సెన్సిటివ్ గానే ఉంటాయి. రాజ‌కీయాల్లో రాణించాల‌నుకునేవారు కాస్త భ‌జ‌న త‌గ్గించి వాస్త‌వాల‌నే గుర్తించి ప్ర‌జ‌ల‌కు మేలు చేస్తే ఎంతో మంచిది అన్న వాద‌న ఒక‌టి స్ప‌ష్టంగా వినిపిస్తోంది ఇవాళ. ఇవే మాట‌లు క‌మెడియ‌న్ కం యాంక‌ర్ అలీకి కూడా వ‌ర్తిస్తాయి. ఆయ‌న‌కు వైసీపీ అంటే ప్రేమ ఉండొచ్చు. కాద‌నం.. అభిమానం ఉండొచ్చు. వ‌ద్ద‌న‌లేం.. కానీ మోతాదు మించి అభిమానం చూపిస్తుంటేనే కాస్త ఎబ్బెట్టుగా ఉంది.. అని అంటోంది విప‌క్షం.

వాస్త‌వానికి ఇప్ప‌టిదాకా ఆయ‌న ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఏనాడూ మాట్లాడ‌లేదు. పోనీ తాను ప్రాతినిధ్యం వహించాలి అని అనుకుంటున్న రాజ‌మండ్రి న‌గ‌రి సమ‌స్య‌ల గురించో, రూర‌ల్ సమ‌స్య గురించో ఏనాడూ మాట్లాడ‌లేదు అని విమ‌ర్శ ఉంది. కానీ ఎందుక‌నో ఈ మ‌ధ్య ఆయ‌న త‌రుచూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాలు అన్న‌వి ఆంధ్రాలోనే అమ‌లు అవుతున్నాయ‌ని చెబుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. అవ‌న్నీ స‌రే అలీ చెబుతున్న లేదా గొప్ప‌గా భావిస్తున్న సంక్షేమంలోనూ లోపాలు ఉన్నాయ‌ని, వాటి గురించి కూడా తెలుసుకుని, అన్నింటా కాక‌పోయినా కొన్ని చోట్ల అయినా ఆ త‌ప్పిదాలు దిద్దుకునేలా వైసీపీ నాయ‌క‌త్వాన్ని అప్ర‌మ‌త్తం చేస్తే మేలు అన్నది విపక్షం చెబుతున్న హిత‌వు.

ఏదేమ‌యిన‌ప్ప‌టికీ రాజ్య స‌భ ప‌ద‌వి ద‌క్క‌క‌పోయినా లేదా ఇత‌ర ప్రాధాన్య ప‌ద‌వి ద‌క్క‌క‌పోయినా కళ్ల నిండా నీళ్లు నింపుకుని మాట్లాడ‌కుండా, ముఖం నిండా చిర్న‌వ్వు నింపుకుని మాట్లాడుతున్న అలీ మంచి నటుడే అని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు వ్యంగాస్త్రాలు వేస్తున్నారు.