Begin typing your search above and press return to search.

ఎంపీ...ఎమ్మెల్సీ అనుకుంటే... చివరికి దక్కింది అంతేనా...?

By:  Tupaki Desk   |   28 Oct 2022 8:46 AM GMT
ఎంపీ...ఎమ్మెల్సీ అనుకుంటే... చివరికి దక్కింది అంతేనా...?
X
అలీ టాలీవుడ్ లో టాప్ కమెడియన్. అలీది నాలుగు దశాబ్దాల హిస్టరీ. అలీ నటుడుగానే కాదు, హీరోగా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే అలీ టీవీలో హోస్ట్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. సామాజిక కార్యక్రమాలలో కూడా అలీ ముందున్నారు. ఆయనకు రాజకీయాల మీద అమిత ఆసక్తి. అందుకే ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం ఆయన టీడీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున తన సొంత ఊరు రాజమండ్రీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రభుత్వంలో మంత్రి కావాలని ఆశ ఉంది.

కానీ అలీ కోరిక టీడీపీలో తీరలేదు. దాంతో ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. ఆయన వైసీపీలో చేరింది కూడా అందుకే. కానీ. అప్పటికే టికెట్ల వ్యవహారం తేల్చేసిన వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే మంచి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. అలా అలీ వైసీపీకి 2019 ఎన్నికల్లో ప్రచారం చేసి గెలుపులో తన వంతు పాత్ర నిర్వహించారు.

ఆ తరువాత నుంచి అలీ చకోర పక్షిగా పదవి కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన ఎమ్మెల్సీ అయినా పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ రెండు విడతలుగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా అలీ పేరు మాత్రం ఎక్కడా వినిపించలేదు.

ఇక రాజ్యసభ సీటు విషయంలోనూ అలీ పేరు ఒక దశలో ప్రముఖంగా వినిపించింది. వైసీపీ తరఫున మైనారిటీ కోటాలో ఎవరూ లేరు కాబట్టి అలీకి చాన్స్ దక్కుతుందని భావించారు. కానీ ఆ పదవి కూడా మీడియా ప్రచారానికే పరిమితం అయింది.

ఇక వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి అయినా దక్కుతుందా అనుకుంటే చివరికి ఆ పదవి కూడా దక్కలేదు. మొత్త్తానికి చూస్తే చాలా మంది ప్రభుత్వ సలహాదరులలో ఒకడిగా ఆలీకి పదవి ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడి పదవి అలీకి దక్కింది. అయితే అలీ కోరుకున్న దానికి లభించిన దానికీ ఎక్కడా పొంతన లేదనే అంటున్నారు. రాజకీయ ఆశ్రితులకు, రాజకీయ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన సలహాదారుల పదవి వల్ల అలీకి పెద్దగా ఒరిగేది ఏమీ లేదని అంటున్నారు. నెలకు గౌరవ వేతనం మూడు లక్షలు ఇతర అలవెన్సులు కలుపుకుని అయిదు లక్షల దాకా లభిస్తాయి.

అయితే అలీ మంచి నటుడు. ఆయన రోజు పారితోషికమే రెండు లక్షలు అని చెబుతారు. దాంతో పాటుగా టీవీ షోలో వ్యాఖ్యతగా ఉన్నారు. అందువల్ల ఆదాయపరంగా ఇదేమీ గిట్టుబాటు పదవి కాదు, ఇక హోదాపరంగా చూస్తే అలీకు కోరుకున్నది ఒకటైతే దక్కింది మరోటి అంటున్నారు. దీని వల్ల అధికారిక దర్జా ఏమీ పెద్దగా ఉండదనే అంటున్నారు. మొత్తానికి ఊరించి ఊరించి అలీకి ఇచ్చిన ఈ పదవి చిన్నదే అంటున్నారు. ఈ పదవి కోసం రెండు దశాబ్దాలుగా అలీ వేచి ఉన్నారా అనందే చర్చ. అయితే 2024 ఎన్నికలు ఉన్నాయి, కాబట్టి ఆ ఎన్నికల్లో పోటీకి ఎమ్మెల్సీ టికెట్ ఏమైనా అలీకి ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.