Begin typing your search above and press return to search.

ఈటలకు కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆహ్వానం?

By:  Tupaki Desk   |   1 May 2021 5:15 PM IST
ఈటలకు కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆహ్వానం?
X
ఈటల రాజేందర్ ను వైద్య ఆరోగ్యశాఖ నుంచి తొలగించడంపై పెను దుమారం చెలరేగింది. తెలంగాణ తొలి ఉద్యమకారుడు అయిన ఈటలను తొలగించడాన్ని తెలంగాణలోని ఇతర పార్టీ నేతలు ఖండిస్తున్నారు. టీఆర్ఎస్ పై మండిపడుతున్నారు.

* ఈటలకు బీజేపీ ఆహ్వానం
తాజాగా ఈ పరిణామంపై బీజేపీ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ ను బీజేపీలోకి ఆహ్వానించారు. రాజేందర్ వస్తే బీజేపీలో చేర్చుకోవడం అనేది పార్టీ నాయకత్వం పరిధిలోని అంశమని అరవింద్ చెప్పారు. తెలంగాణ కేబినెట్ లో పనిచేసే ఏకైక మంత్రి ఈటల రాజేందర్ అని చెప్పారు. అయితే అవినీతికి పాల్పడిన వారిని బీజేపీ నాయకత్వం ఉపేక్షించదని.. ఈ విషయంలో మరో మాట లేదన్నారు.

*స్పందించిన కాంగ్రెస్
ఇక ఈటల ఎపిసోడ్ పై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. ఈటలను టీఆర్ఎస్ నుంచి తొలగించేలా కేసీఆర్ కుట్ర పన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఈటల హరీష్.. కేసీఆర్ కు అండగా ఉన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, సంతోష్ కుమార్ ఆస్తులపై విచారణ జరిపించాలని జీవన్ రెడ్డి మాండ్ చేశారు. జీవోనెంబర్ 111 ఉల్లంఘించి జున్వాడలో ఫాంహౌస్ నిర్మించిన కేటీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

*కేటీఆర్, మల్లారెడ్డిల సంగతేంది: కోదండరాం
మంత్రి ఈటల రాజేందర్ పై వస్తున్న భూకబ్జా ఆరోపణలతోపాటు మంత్రి కేటీఆర్, మరో మంత్రి మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, మంచిరెడ్డి, మహిపాల్ రెడ్డిలపై గతంలో వచ్చిన ఆరోపణలపై కూడా విచారణ చేయాలని టీజేఎస్ అధినేత కోదండరాం డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడినందుకే విచారణ చేస్తున్నారని కోదండరాం మండిపడ్డారు. ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకే భూవివాదాలు, హఫీజ్ పేట్, మియాపూర్ భూములపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈటెల నిజాయితీతో తేలితే చేర్చుకుంటామని బీజేపీ ఆహ్వానం పంపింది. ఇక ఈటలపై కేసీఆర్ కుట్రపన్ని తొలగించారని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈటలనే కాదు.. ఆరోపణలు వచ్చిన కేటీఆర్, మల్లారెడ్డిలపై కూడా విచారణ జరుపాలని కోదండ రాం సహా పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు.