Begin typing your search above and press return to search.

కాలేజీ గొడవ గ్యాంగ్ వార్ లా మారింది. సత్తెనపల్లిలో సంచలనం

By:  Tupaki Desk   |   8 Aug 2021 10:08 AM IST
కాలేజీ గొడవ గ్యాంగ్ వార్ లా మారింది. సత్తెనపల్లిలో సంచలనం
X
కాలేజీలో చిన్న గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. అక్కడితో ఆగిందా? కాలేజీ క్యాంపస్ దాటి.. రోడ్ల మీద కార్లు.. బైకులు.. చేజింగ్ లు.. కొట్టడాలు.. గాయపర్చడాలు ఇలా ఊహించని మలుపులు తిరగటమేకాదు.. చూపురులను భయభ్రాంతులకు గురి చేసిన ఈ ఉదంతం గురించి వింటే.. నిజంగానే ఇదంతా జరిగిందా? అన్న సందేహం కలుగక మానదు. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కంటెపూడి ఇంజనీరింగ్ కాలేజీలో మొదలైన చిన్న గొడవ కాస్తా చివరకు గ్యాంగ్ వార్ గా మారింది. విద్యార్థుల మధ్య గొడవ సినిమా ఫైట్ కు మించిపోయింది. పరస్పరం దాడులు చేసుకోవటం.. వాహనాలతో ఛేజింగులతో ఆ ప్రాంతమంతా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. తీవ్రమైన భయాందోళనలకు గురైన పరిస్థితి. ఈ గొడవలోని ఒక సన్నివేశాన్ని చూస్తే.. గొడవలో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే.. వారి ప్రత్యర్థులు బైకుల మీద వెంట పడ్డారు. కారును ముందుకు పోనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తమను అడ్డు పడుతున్న బైకుల్ని గుద్దేస్తూ.. కారును ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారు ముందు భాగం దెబ్బ తిన్నా పట్టించుకోకుండా ఆసుపత్రి వైపు వేగంగా వెళ్లారు.

ఇలా.. భారీ దాడులకు కారణమైన కంటెపూడి ఇంజనీరింగ్ కాలేజీలో గొడవ ఎలా మొదలైంది? దీనికి కారకులు ఎవరన్న విషయంలోకి వెళితే.. కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ప్రియతమ్. ఈ మధ్యన కాలేజీకి వచ్చాడు. అంత సీనియర్ అయి ఉండి జూనియర్లకు సిగిరెట్లు.. టీలు మోసుకు వస్తాడంటూ బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి కార్తీక్ రెడ్డి చులకనగా మాట్లాడుతున్నట్లు తెలుసుకున్న ప్రియతమ్.. తనకు ఎదురుపడటంతో అతన్ని నిలదీశాడు. వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగి..గొడవ ఎక్కువైంది. దీంతో.. అక్కడున్న విద్యార్థులు వారిద్దరిని సముదాయించి అక్కడి నుంచి పంపేశారు.

తాజాగా ప్రియతమ్ అతని సోదరు ఆదర్శ్ తో కలిసి కాలేజీకి వచ్చాడు. వీరిని గమనించిన కార్తీక్ రెడ్డి గొడవలు మళ్లీ జరగకుండా ఉండటానికి వీలుగా రాజీ చర్చల కోసం పిలుస్తున్నట్లు ప్రియతమ్ కు చెప్పారు. దీంతో.. కాలేజీ బయట స్నేహితులతో ఉన్న కార్తీక్ రెడ్డి అతడి బ్యాచ్ ను కలిసేందుకు ప్రియతమ్.. ఆదర్శ్ లు వెళ్లారు. అక్కడ మాటల కంటే కూడా వాదనలే ఎక్కువ కావటం.. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు నోటికొచ్చిన మాటలు అనుకోవటంతో వారి మధ్యన ఘర్షణ మొదలైంది. అనూహ్యంగా మాటలు ముదిరి చేతల వరకు వెళ్లటం.. పరస్పర దాడులు మొదలయ్యాయి.

అక్కడే ఉన్న పాకలోని కర్రల్ని తీసిన కార్తీక్ రెడ్డి సభ్యులు.. ప్రియతమ్ అతడి సోదరుడి మీద విరుచుకుపడ్డారు. దీంతో ఆదర్శ్ కు దెబ్బలు తగిలి రక్తస్రావం కావటంతో అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కారులో తీసుకెళ్తున్నాడు. అయితే.. వారిని అడ్డుకునేందుకు కార్తీక్ రెడ్డి స్నేహితులుప్రయత్నించారు. తమ టూవీలర్లను కారుకు అడ్డు పెట్టసాగారు. దీంతో.. తన కారుతో వాటిని ఢీ కొడుతూ ఆసుపత్రికి చేరుకున్నాడు.

ఈ క్రమంలో కారు ముందు భాగం మొత్తం ధ్వంసమైనట్లు చెబుతున్నారు.ఇక.. కార్తీక్ మనుషులు కూడా గాయపడ్డారు. ఈ గొడవల కారణంగా మొత్తంగా తొమ్మిది మందికి గాయాలైనట్లుగా తేలింది. ఈ గొడవ గురించి తెలుసుకున్నపోలీసులు ఎంట్రీ ఇచ్చి అసలు వివరాల్ని సేకరించగా.. గొడవకు పాల్పడిన కుర్రాళ్లు కాలేజీకి సంబంధం లేని వారిగా గుర్తించారు. ప్రియతమ్ అతడి సోదరుడు గుంటూరు కాగా.. కార్తీక్ రెడ్డిది ముప్పాళగా గుర్తించారు. మిగిలిన కుర్రాళ్లు సత్తెనపల్లికి చెందిన వారుగా గుర్తించారు. గొడవకు కారణమైన అందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రిమాండ్ కు పంపే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.