Begin typing your search above and press return to search.

మ‌రోసారి వార్త‌ల్లో క‌ర్ణాట‌క‌లో తెలుగు క‌లెక్ట‌ర్‌

By:  Tupaki Desk   |   27 Jun 2018 1:43 PM IST
మ‌రోసారి వార్త‌ల్లో క‌ర్ణాట‌క‌లో తెలుగు క‌లెక్ట‌ర్‌
X
నీతిగా.. నిజాయితీగా ప‌ని చేస్తే ఏమవుతుంది? వ‌రుస బ‌దిలీల‌తో షాకుల మీద షాకులు త‌గులుతుంటాయి. గ‌డిచిన కొద్ది నెల‌లుగా క‌ర్ణాట‌క మీడియాలో పెద్ద ఎత్తున వార్త‌ల్లో నిలిచారు దాస‌రి రోహిణీ సింధూరి. క‌ర్ణాట‌క క్యాడ‌ర్ లో ప‌ని చేసే ఈ తెలుగు క‌లెక్ట‌ర‌మ్మ ముక్కుసూటి. నిజాయితీకి నిలువెత్తు రూపం. ఒత్తిళ్లు ఏ మాత్రం త‌లొగ్గ‌ని ఆమె.. రాజ‌కీయ బాసుల్ని ఎదిరించి మ‌రీ నిల‌బ‌డే స‌త్తా ఉన్న ఆఫీస‌రు.

అయితే.. ఆమె తీరుకు అదే ప‌నిగా బ‌దిలీ వేటు వేసిన సిద్ధ‌రామ‌య్య స‌ర్కారు దెబ్బ‌కు తెగ ఇబ్బంది ప‌డిపోయింది. అయిన‌ప్ప‌టికీ త‌న‌పై జ‌రుగుతున్న బ‌దిలీల దాడిని న్యాయ‌ప‌రంగా ఎదుర్కొనేందుకు సిద్ధ‌మైన ఆమె.. తాజాగా ఆ పోరాటంలో విజ‌యం సాధించారు. హ‌స‌న్ లో డిప్యూటీ క‌మిష‌న‌ర్ గా నియ‌మిస్తూ క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో.. ఆమె మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు.

ఖ‌మ్మం జిల్లాలో పుట్టిన ఈ తెలుగ‌మ్మాయి హైద‌రాబాద్ లోనే చ‌దివారు. సివిల్స్ లో జాతీయ స్థాయిలో 43వ ర్యాంక్ సాధించిన సింధూరి క‌ర్ణాట‌క క్యాడ‌ర్ లో ఎంపిక చేసుకున్నారు. సిద్ద‌రామ‌య్య సీఎంగా ఉన్న వేళ హ‌స‌న్ జిల్లా డిప్యూటీ క‌మిష‌న‌ర్ గా నియ‌మితుల‌య్యారు. ముక్కుసూటిగా ఉండ‌టంతోపాటు.. రాజ‌కీయాల‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌ని ఆమె తీరు నాటి అధికార‌ప‌క్షానికి ఇబ్బందిక‌రంగా మారింది. ఒత్తిళ్లు.. హెచ్చ‌రిక‌లకు ఆమె త‌లొగ్గ‌లేదు.

జిల్లాలోని హేమావ‌తి న‌దీతీరం వెంట స‌క‌లేశ్ పురా.. బేలూరు.. ఆలూరు ప్రాంతాల్లో ఇసుక మాఫియా అడ్డూఆపూ లేకుండా చెల‌రేగిపోవ‌టంపై స్పందించిన ఆమె క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌టం షురూ చేశారు. ఇసుక అక్ర‌మ ర‌వాణాదారుల‌పై ఉక్కుపాదాన్ని మోపారు. ఈ దెబ్బ రాజ‌కీయంగా భారీగా త‌గ‌ల‌టంతో అధికార కాంగ్రెస్‌కు న‌చ్చ‌లేదు.

ఇదిలా ఉన్న‌ప్పుడే శ్రావ‌ణ‌బెళ‌గొళ‌లో గోమ‌ఠ‌శ్వ‌రుడి మ‌హామ‌స్త‌కాభిషేక ఉత్స‌వ సంద‌ర్భంగా తాత్కాలిక మండ‌పాన్ని నిర్మించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

ఆ కాంట్రాక్టును త‌మ వాళ్ల‌కు అప్ప‌గించేందుకు వీలుగా పావులు క‌దిపారు.అయితే.. దానికి చెక్ చెబుతూ.. ఎవ‌రైతే త‌క్కువ ధ‌ర‌కు కోట్ చేశారో వారికే ఆ కాంట్రాక్ట్ ద‌క్కేలా సింధూరి నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది సిద్ద‌రామ‌య్య స‌ర్కారుకు న‌చ్చ‌లేదు. నాటి జిల్లా మంత్రి మంజుకు ఆమెకు మ‌ధ్య తీవ్ర విభేదాల‌కు కార‌ణ‌మైంది. ఈ నేప‌థ్యంలో ఆమెను ప‌రిశ్ర‌మ‌ల శాఖ ఎండీగా బ‌దిలీ వేటు వేశారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న వేళ బ‌దిలీ నిర్ణ‌యంపై స్టే ఇచ్చారు. దీనిపై ఆమె న్యాయ‌పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు.

అయితే.. ట్రిబ్యున‌ల్ లో త‌న‌కు వ్య‌తిరేకంగా తీర్పు రావ‌టంతో ఆమె హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే.. ఈ వ్య‌వ‌హారంలో హ‌స‌న్ ఎంపీగా వ్య‌వ‌హ‌రిస్తున్న మాజీ ప్ర‌ధాని దేవెగౌడ కుమారుడు రేవ‌ణ్ణ సిద్ధ‌రామ‌య్య మీద ఉన్న రాజ‌కీయ వైరంతో సింధూరికి అండ‌గా నిలిచారు. తాజాగా ఆయ‌న సోద‌రుడు కుమార‌స్వామి క‌ర్ణాట‌క సీఎం కావ‌టంతో ఆమెను హ‌స‌న్ జిల్లాలో తిరిగి అదే పోస్టుకు నియ‌మించారు. దీంతో.. ఆమె పోరాటం స‌క్సెస్ కావ‌ట‌మే కాదు.. తాను అనుకున్న చోట‌నే విధులు నిర్వ‌ర్తించేలా చేసుకోగ‌లిగారు. గ‌తంలో మాదిరే మ‌రిప్పుడు కూడా ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తే మాత్రం ఆమె స్ఫూర్తిదాత‌గా నిలిచిపోతార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.