Begin typing your search above and press return to search.

అర్థ‌రాత్రి వేళ ఆ క‌లెక్ట‌ర్ బైక్ మీద‌..!

By:  Tupaki Desk   |   25 April 2017 6:09 AM GMT
అర్థ‌రాత్రి వేళ ఆ క‌లెక్ట‌ర్ బైక్ మీద‌..!
X
ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కూ దాని కోసం ప‌డే ఆరాటం అంతా ఇంతా కాదు. వ‌చ్చిన త‌ర్వాత‌.. అంద‌రిలో ఒక‌రిగా త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోతుంటారు. కానీ.. మ‌రికొంద‌రు మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అంద‌రు న‌డిచే బాట‌లో న‌డ‌వ‌కుండా.. ఏదో ఒక‌టి చేయాల‌న్న త‌ప‌న‌తో తెగ ఆరాట‌ప‌డిపోతుంటారు. ఇలాంటి వారిలో కొంద‌రు.. త‌మ స్థాయిని.. హోదాను వ‌దిలేసి.. భిన్న‌మైన బాట‌లో న‌డిచి అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తుంటారు. తాజాగా చెప్ప‌బోయే క‌లెక్ట‌ర్ ముచ్చ‌ట కూడా ఇదే రీతిలో ఉంటుంది.

రోటీన్‌ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆ కలెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తున్న ముర‌ళి.సాధార‌ణంగా క‌లెక్ట‌ర్ అంటే.. ఆ హ‌డావుడి.. వ్య‌వ‌హారం వేరుగా ఉంటుంది. క‌లెక్ట‌ర్ కాలు బ‌య‌ట‌కు పెట్టారంటే.. అధికార గ‌ణం ప‌రుగులు పెడుతుంటుంది. కానీ.. క‌లెక్ట‌ర్ ముర‌ళీ తీరు అందుకు భిన్నంగా ఉంటుంది. సామాన్యుల‌తో క‌లిసిపోతూ.. వారి ఈతి బాధ‌ల్ని తెలుసుకుంటూ.. వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం నిరంత‌రం త‌పించే వైనం క‌నిపిస్తుంది.

తాజాగా ఆయ‌న రాత్రి ప‌ది గంట‌ల నుంచి అర్థ‌రాత్రి 2.30గంట‌ల వ‌ర‌కూ భూపాల‌ప‌ల్లి ప‌ట్ట‌ణంలో ఆక‌స్మికంగా ప‌ర్య‌టించారు. అంద‌రికి షాకిస్తూ.. బైక్ మీద ప్ర‌యాణించిన ఆయ‌న‌.. హెల్మెట్ పెట్టుకొని.. త‌న ఆన‌వాళ్లు అంద‌రికి తెలీకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. సిబ్బంది వెంట లేకుండా ఒంట‌రిగా ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన ఆయ‌న‌.. రోడ్లు ఎలా ఉన్నాయి? డ‌్రైనేజీ ఎలా ప‌ని చేస్తోంది? అన్న అంశాల‌తో పాటు.. స్థానికుల‌ను వారి స‌మ‌స్య‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఒక క‌లెక్ట‌ర్ ఒంట‌రిగా.. బైకు మీద ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/