Begin typing your search above and press return to search.

లంచం ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన క‌లెక్ట‌ర్‌!

By:  Tupaki Desk   |   2 Sep 2016 5:26 AM GMT
లంచం ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన క‌లెక్ట‌ర్‌!
X
వ్య‌వ‌స్థ‌లో పేరుకుపోయిన లంచ‌గొండి త‌నానికి ఇదే నిద‌ర్శ‌నం. సామాన్యుల‌కు న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌డంపై సాక్షాత్తు జిల్లా క‌లెక్ట‌ర్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల్లోని కొంద‌రు లంచావ‌తార రూపం ఎత్తి వేధిస్తున్న తీరుపై మండిప‌డ్డారు. ఆఖ‌రికి తానే లంచం ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే త‌ర్వాత సీన్ వేరేలా ఉంటుంద‌ని కూడా చెప్పారు. ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌తో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌.

స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో విద్యాశాఖ ప్రగతి తీరుపై అధికారులతో క‌లెక్ట‌ర్‌ సమీక్షించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులకు ప‌ట్టెడన్నం పెట్టే మ‌ధ్యాహ్న భోజ‌నం గురించి చ‌ర్చ‌కు వ‌చ్చింది. జిల్లాలో మధ్యాహ్న భోజనం వండిపెట్టే డ్వాక్రా సంఘాలకు బిల్లులు పెండింగ్‌ లో ఉన్న విష‌యాన్ని క‌లెక్ట‌ర్ గ‌మ‌నించారు. బిల్లుల చెల్లింపులకు లంచం డిమాండ్ చేస్తున్న తీరు త‌న దృష్టిలో ఉన్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ...."ట్రెజరీల్లో బిల్లుల చెల్లింపులో లంచాలడిగితే కాదనకండి. మీ ద‌గ్గ‌ర లేక‌పోతే నా దగ్గరకు వస్తే సొంత డబ్బులు ఇస్తాను. బిల్లులు మంజూరు చేయించుకోండి. అయితే తెల్లారిన తర్వాత లంచం తీసుకున్న వ్యక్తి ఉద్యోగంలో ఉండబోడు అనేది వారు గ‌మ‌నించుకోవాలి" అని కలెక్టరు హెచ్చరించారు. ఉద్యోగులు ఎవ‌రైనా వారిలో నైతిక విలువ‌లు, తాము స‌మాజానికి ఏదైనా సేవ చేయాల‌నే బావ‌న లేక‌పోతే అభివృద్ధి అసాధ్య‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జిల్లాలో 3,316 పాఠశాలల్లో 1509 పాఠశాలల్లోనే తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించారని, మిగతా వాటిల్లో ఎందుకు నిర్వహించడం లేదని డీఈఓను ప్రశ్నించారు. ఉపాధ్యాయుల్లో బాధ్య‌త పెర‌గాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. కలెక్టర్ గారి ప్రకటన తర్వాత అయినా లంచగొండుల్లో మార్పు వస్తుందా? వేచి చూడాల్సిందే