Begin typing your search above and press return to search.

తనకు తానే రూ.5వేలు ఫైన్ వేసుకున్న కలెక్టర్

By:  Tupaki Desk   |   10 Oct 2019 5:35 AM GMT
తనకు తానే రూ.5వేలు ఫైన్ వేసుకున్న కలెక్టర్
X
ఇదో చిత్రమైన ఉదంతం. మాటల్లో చూపించే కమిట్ మెంట్ చేతల్లో ప్రదర్శించటం అంత తేలికైనది కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశ్నించే ధోరణిని ఎంత కుదిరితే అంతగా తొక్కేస్తున్న వేళలో.. ప్రశ్నించిన వారి మాటల్లోని నిజాయితీని.. సూటిదనాన్ని ఆహ్వానించే ఆరోగ్యకర పరిస్థితిని ఇప్పుడు ఊహించలేమేమో. అధికారంలో ఉన్న వారిని.. మీరిలాంటి తప్పు చేయటమా? అని ప్రశ్నించే పరిస్థితులు ఇప్పుడైతే లేవన్న మాట జోరుగా వినిపిస్తూ ఉంటుంది. కానీ.. ఆ వాదన తప్పన్న రీతిలో తాజాగా ఒక పరిణామం మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు స్పందించిన కలెక్టర్.. జరిగిన తప్పునకు తనకు తాను రూ.5వేలు ఫైన్ వేసుకున్న ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఇక్కడ ప్రశ్నను సంధించిన రిపోర్టర్ కంటే కూడా.. ప్రశ్నలోని నిజాయితీని ఒప్పుకుంటూ ఫైన్ వేసుకున్న కలెక్టర్ ను ప్రత్యేకించి అభినందించాల్సిందే. ప్రజాస్వామ్య భారతంలో అధికార పక్షం.. అధికారులు ఎంత బాధ్యతగా ఉండాలన్న విషయాన్ని తెలియజేసే ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది.

మహారాష్టలోని బీడ్ జిల్లా కలెక్టర్ అస్తీక్ కుమార్. తాజాగా జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న తీరు.. ఎంతమంది నామినేషన్లు వేశారు? లాంటి వివరాల్ని వెల్లడించేందుకు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు టీ ఇచ్చారు. అయితే..టీ ఇచ్చే క్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కప్పుల్లో సర్వ్ చేశారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక రిపోర్టర్.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద బ్యాన్ ఉన్న వేళ.. మీ అటెండర్లు ఇచ్చిన కప్పులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కదా? దీనికి ఏమంటారని ప్రశ్నించారు. రిపోర్టర్ ప్రశ్నకు ఇగోకు వెళ్లని సదరు కలెక్టర్.. జరిగిన తప్పును ఒప్పుకుంటూ.. తనకు తానుగా రూ.5వేలు జరిమానాను విధించుకున్నట్లుగా ప్రకటించటంతో సంచలనంగా మారింది.

తప్పు జరిగినప్పుడు దాన్ని ఒప్పుకోవటం.. అందుకు తగ్గ జరిమానాను ఉన్నతాధికారులు తమకు తాముగా షురూ చేస్తే.. ఆ బాటలోనే మరికొందరు నడిచే ప్రయత్నం చేస్తారే కానీ.. పవర్ తో తప్పించుకునే ప్రయత్నం చేయరు. కలెక్టర్ అస్తీక్ కుమార్ పాండే చేసిన పనిని ఇప్పుడు పలువురు అభినందిస్తున్నారు. మీడియా సమావేశం ముగిసిన తర్వాత.. అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్.. సింగిల్ ప్లాస్టిక్ వాడకాన్నినియంత్రించే విషయంలో జరుగుతున్న తప్పులపై గట్టిగా క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. ఏమైనా ఈ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. సదరు కలెక్టర్ తీరులోనే అధికారంలో ఉన్న వారు వ్యవహరించాలన్న మాట వినిపిస్తోంది.