Begin typing your search above and press return to search.

మానుకోట కాంగ్రెస్‌లో ర‌చ్చ‌..!

By:  Tupaki Desk   |   18 Dec 2021 12:47 PM IST
మానుకోట కాంగ్రెస్‌లో ర‌చ్చ‌..!
X
మ‌హ‌బూబాబాద్ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్ జ‌రుగుతోంది. పార్ల‌మెంట‌రీ స‌మీక్ష స‌మావేశంలో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. గురువారం ఇల్లెందులో కాంగ్రెస్ స‌భ్య‌త్వ న‌మోదు స‌మీక్ష జ‌రిగింది.

ఈ స‌మావేశంలో పాల్గొన్న డీసీసీ అధ్య‌క్షుడు పొదెం వీర‌య్య చేసిన వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపాయి. స్థానికేత‌రుల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడిన మాట‌లతో పార్టీ శ్రేణులు గంద‌ర‌గోళంలో ప‌డ్డాయి. పార్టీలో అస‌లు ఏం జ‌రుగుతుందో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకున్నాయి.

మొద‌టి నుంచీ పార్టీ కోసం ప‌నిచేస్తున్న స్థానిక నేత‌ల‌ను కాద‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇస్తే త‌రిమికొట్టాల‌ని పొదెం వీర‌య్య తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌హ‌బూబాబాద్ ఎంపీ బ‌ల‌రాం నాయ‌క్ ను ఉద్దేశించి కూడా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండ‌క‌పోవ‌డం వ‌ల్లే గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయార‌ని.. ఇప్ప‌టికైనా ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని బ‌ల‌రాం నాయ‌క్ ను వీర‌య్య హెచ్చ‌రించారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని ఇల్లెందు నియోజ‌క‌వ‌ర్గం మ‌హ‌బూబాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలో ఉండ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. పొదెం వీర‌య్య వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ లో ఉన్న మ‌రో వ‌ర్గం నిర‌స‌న వ్య‌క్తం చేసింది. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌ రాంచంద్ర‌య్య నాయ‌క్ ఈ విష‌యంపై మండిప‌డ్డారు.

స్థానికేత‌రులు ఎవ‌రో తేల్చుకోవాల్సింది ముందుగా పొదెం వీర‌య్య గుర్తిస్తే మంచిద‌ని హెచ్చ‌రించారు. ములుగు నియోజ‌క‌వ‌ర్గం వ‌దిలి భ‌ద్రాచ‌లం నుంచి పోటీ చేసిన వీర‌య్యే స్థానికేత‌రుడ‌ని.. దొంగే దొంగా.. దొంగా.. అని అరిచిన‌ట్లుగా ఉంద‌ని ఆరోపించారు.

పొదెం వీర‌య్యే పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టించ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్నార‌ని పేర్కొన్నారు. బ‌య్యారం కాంగ్రెస్ అధ్య‌క్షుడు కూడా రాంచంద్ర‌య్య నాయక్‌కు మ‌ద్ద‌తు ప‌లికారు. అయితే పొదెం వీర‌య్య వ్యాఖ్య‌ల వెనుక ఏదో పెద్ద వ్యూహ‌మే ఉంద‌ని మ‌రో వ‌ర్గం ఆరోపిస్తుంది.

రాంచంద్ర‌య్య నాయ‌క్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మ‌ద్ద‌తుగా నిలుస్తుండ‌డంతోనే ఆయ‌న ఈ విధంగా మాట్లాడుతున్నార‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌లో వీర‌య్య‌కు ములుగు టికెట్ ద‌క్క‌క‌పోవ‌డానికి రేవంతే కార‌ణ‌మ‌నే అభిప్రాయంతో వీర‌య్య ఉన్నార‌ని.. త‌న‌కు రావాల్సిన టికెట్‌ను సీత‌క్క‌కు ఇప్పించుకున్నార‌నే కోపంతో ఉన్నార‌ట‌.

అందుకే రేవంత్ వ‌ర్గానికి అవ‌కాశం ఇవ్వ‌రాద‌నే ఆలోచ‌న‌లో వీర‌య్య ఉన్నార‌ట‌. అలాగే ఇల్లెందు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హ‌రిప్రియ‌ను దృష్టిలో ఉంచుకొని కూడా వీర‌య్య ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.

హ‌రిప్రియ వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తిరిగి కాంగ్రెస్‌లో చేరే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నార‌ని.. ఆమె రాక‌ను కూడా నిరోధించేందుకే ముంద‌రి కాళ్ల‌కు బంధం వేసేందుకే ఆయ‌నీ విధంగా వ్యాఖ్య‌లు చేసి ఉండొచ్చు అని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ఈ స‌మావేశంలో మౌనం దాల్చిన‌ బ‌ల‌రాం నాయ‌క్ కూడా ఇప్పుడు రేవంత్ టీంలో ఉండ‌డం గ‌మ‌నార్హం. రేవంత్ అంటే మొద‌టి నుంచీ వీర‌య్య‌కు ఇష్టం లేద‌ని.. పార్టీలోకి ఆయ‌న రాక‌ను కూడా వ్య‌తిరేకించార‌ని.. పీసీసీ చీఫ్ అభిప్రాయ సేక‌ర‌ణ‌లో కూడా కోమ‌టిరెడ్డికే మ‌ద్ద‌తు ప‌లికార‌ని రేవంత్ వ‌ర్గం భావిస్తోంది.