Begin typing your search above and press return to search.

కోడిపందాలకు కొత్త ఏర్పాట్లు రెడీ

By:  Tupaki Desk   |   12 Jan 2017 5:52 PM GMT
కోడిపందాలకు కొత్త ఏర్పాట్లు రెడీ
X
సంక్రాంతికి సంప్రదాయంగా వస్తున్న కోడి పందాల విష‌యంలో న్యాయ‌స్థానం విధానాలు అడ్డంకిగా మార‌డంతో నేత‌లు రూటు మార్చారు. పోలీసు నిఘా మాటున ఊరి చివరి మామిడితోటల్లో రహస్య బరులు సిద్ధమయ్యాయి. ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్య పందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు ఈసారి వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆధునిక సమాచార వ్యవస్థను ఉపయోగించుకుని ఎక్కడెక్కడ కోడి పందేలు జరుగుతున్నాయో సమాచారాన్ని అప్పటికపుడు తెలుసుకుని చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. ఈక్రమంలో పందెం రాయుళ్లు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నట్టు తెలిసింది.

పండగ మూడు రోజుల్లో పోలీసుల నిఘా అధికంగా ఉన్నప్పటికీ గత ఏడాది యథేచ్ఛగా పందాలు జరిగాయి. ప్రస్తుతం గ్రామాల్లో కోడి పందేల సరదాల మాటున సాగుతోంది. అనేక ప్రాంతాల్లో పోలీసులు పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ సంప్రదాయం ముసుగులో అనేక మంది జూదాలకు సిద్ధమవుతున్నారు. కోనసీమ, మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లలో బిజీ అయ్యారు. కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలో ఫ్లడ్‌లైట్లు పెట్టి మరీ గత వారం రోజులుగా పందాలు నిర్వహిస్తున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి పెద్ద ఎత్తున కోళ్లను, పందెం రాయుళ్లను పట్టుకున్నారు. ఈసారి కొత్తగా రాత్రి సమయాల్లో కోడి పందేలు నిర్వహించాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం సమీపంలో పందెం కోడి పుంజులు సిద్ధం చేస్తున్న తోటల్లోనే ఫ్లడ్ లైట్ల వెలుగులో పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. రాజానగరం, కోరుకొండ, గోకవరం, ఏజెన్సీ ముఖద్వారంలోనూ ఈ సారి పందెం రాయుళ్లు మామిడి తోటలను లీజులకు తీసుకుని పందాలకు సిద్ధమైనట్టు సమాచారం. రాజానగరం సమీపంలోని జాతీయ రహదారికి సమీపంలోనే పామాయిల్ తోటల్లో పెద్ద ఎత్తున పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిసింది. ఎక్కడెక్కడ పందాలు నిర్వహిస్తారు.. ఎక్కడ పందాలకు సిద్ధం చేసే కోడి పుంజులను తయారు చేస్తున్నారనే సమాచారం పోలీసుల వద్ద ఉన్నట్టు సమాచారం.

కోనసీమ, మెట్ట, పశ్చిమ గోదావరి జిల్లా వైపు నుంచి లాంచీలపై వచ్చి దేవీపట్నం మండలంలో పందేలు నిర్వహించేందుకు సమాయత్తమైనట్టు తెలిసింది. ఐ.పోలవరం మండలం మురమళ్లలో గత ఏడాది రబీ సాగు చేయకుండా పందెం బరుల కోసం పొలాలను వదిలేశారు. ఇపుడు కూడా అదే తరహాలో ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం. కోనసీమలోని పేరవరం - మురమళ్ల - ఎస్.యానాం - కిత్తనచెరువు - చల్లపల్లి - గోడి - గోడితిప్ప తదితర ప్రాంతాల్లో సంప్రదాయబద్ధంగా పందాలు జరిగేవి. ఇపుడు ఆయా ప్రాంతాల్లో స్ధానచలనం ఉన్నట్టు తెలిసింది. అంబాజీపేట మండలం వాకలగరువు, మల్కిపురం మండలం వివి మెరక, సఖినేటిపల్లి మండలం రామరాజులంక, రావులపాలెం మండలం దేవరపల్లి ప్రాంతాల్లో బరులు సిద్ధం చేస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/