Begin typing your search above and press return to search.

కోర్టు ఆర్డ‌ర్ బేఖాత‌రు..కోడి పందాల దూకుడు

By:  Tupaki Desk   |   12 Jan 2018 8:36 AM GMT
కోర్టు ఆర్డ‌ర్ బేఖాత‌రు..కోడి పందాల దూకుడు
X
సంక్రాంతి అంటేనే గుర్తుకు వ‌చ్చే కోడి పందేలా విష‌యంలో ఆంక్ష‌లు...రాష్ట్ర స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాలు లైట్ తీసుకుంటున్నారు. కోడి పందేలు ఆడేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసినా పందెం రాయుళ్లు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. చాప కింద నీరులా తమ పని తాము చేసుకుపోతున్నారు. నిర్వహకులంతా కోడి పందేల బరులు తయారు చేయడంలో నిమగమ య్యారు. కోర్టు ఆర్డ‌ర్ లైట్‌...జోరుగా కోడిపందాల బిజీలో ప‌డిపోయారు.

ఉభయ గోదావరి జిల్లాల‌తో పాటుగా కృష్ణా - గుంటూరుతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఇదే రీతిలో సంక్రాంతి జూదానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. కొన్ని చోట్ అధికార పార్టీ నాయ‌కులే అండ‌గా ఉండి కోడి పందేలు ఆడిస్తున్నార‌నే ప్ర‌చారం కూడా జోరుగా సాగుతోంది. కోడి పందేల విషయంలో ఈ ఏడాది హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో 1960 జంతు రక్షణ చట్టం, 1974 గేమింగ్‌ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసింది. తహశీల్దార్‌ తో పాటు పోలీస్‌ - రెవిన్యూ - పశుసంవర్థకశాఖ సిబ్బంది - ఎన్‌ జిఒ సభ్యులుండే ఈ కమిటీలు గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడంతో పాటు కోడి పందేలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పాత నేరస్థుల్ని బైండోవర్‌ చేయాలని కూడా ఆదేశాలున్నాయి. దీంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారాన్ని జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలకు అందజేయాల్సి ఉంటుంది.

అయితే ఆచ‌ర‌ణ‌లో ఇదేమీ సాగ‌డం లేదంటున్నారు. జూద క్రీడల నిరోధానికి కమిటీలేర్పడి వారం రోజులు పూర్తయినా కోడి పందేల నిర్వహణకు జిల్లాల్లో చేస్తున్న ఏర్పాట్లను అడ్డుకోవడంలో విఫలమయ్యాయనే ఆరోపణలొస్తున్నాయి. కోడి పందేలతో పాటు ఇతర జూదాల నిరోధానికి తీసుకున్న చర్యలు, ఏర్పాటు చేసిన అవగాహన సమావేశాల సమాచారాన్ని ఇంత వరకు కమిటీలు బహిర్గతపరచక పోవడం గమనార్హం. అధికారపార్టీ ఒత్తిళ్లతో పాటు స్థానిక నేతలు నయానో భయానో బెదిరించడంతో కొందరు కమిటీ సభ్యులు తమకెందుకులే అన్న ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కోడి పందేలు య‌థేచ్చ‌గా సాగిపోతున్నాయని చెప్తున్నారు.