Begin typing your search above and press return to search.

కోడిపందేలకు కౌంట్ డౌన్‌..ఏటీఎంలు ఖాళీ

By:  Tupaki Desk   |   7 Jan 2018 10:58 AM GMT
కోడిపందేలకు కౌంట్ డౌన్‌..ఏటీఎంలు ఖాళీ
X
సంక్రాంతి పండుగకు మరో వారం రోజులు మాత్రమే గడువున్న నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో కోడి పందేల సంద‌డి మొద‌లైంది. వారం రోజు గ‌డువు మాత్ర‌మే ఉన్నందున కౌంట్‌ డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ నుంచి బరుల్లో కోడి పందాలకు పందాలరాయుళ్లు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. కోడి పందేలు జరగనీయరాదని హైకోర్టు ఆదేశించిన‌ప్ప‌టికీ... ఎలాగైనా బరిలో పందెం పుంజు కొట్లాడాల్సిందేనని పందేలరాయుళ్లు వ్యూహాలు రచిస్తున్నారు.

గోదావ‌రి జిల్లాల స‌మాచారం ప్ర‌కారం హైద‌రాబాద్‌ తో పాటుగా ఢిల్లీ - ముంబై - కర్ణాటక - తెలంగాణ - ఒడిస్సా - చెన్నై తదితర రాష్ట్రాల్లో ఉన్న బంధువర్గం ఈ సోమ‌వారం నాటికే తమ స్వగ్రామాలకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. వీరు పందాల నిర్వాహకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఏడాది కోడి పందాలను వీక్షించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా నేతలు తరలిరానున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా ఇప్పటి నుంచే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని దాదాపుగా అన్ని బ్యాంకుల్లో నగదు విత్ డ్రాలు పెరిగాయి. ఈ జిల్లాలో పందేలు రూ.కోట్లలో జరుగుతాయనే సంగతి తెలిసిందే. దీనితో పందేలరాయుళ్లు ముందస్తు జాగ్రత్తగా నగదు నిల్వలపై దృష్టిసారించారు. ఇప్పటికే దాదాపు అన్ని ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తుండటం గ‌మ‌నార్హం. కొద్ది రోజుల్లో బ్యాంకులు కూడా ఈ బోర్డులు పెడతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు గ్రామాల్లో నగదు విత్‌ డ్రా చేయడం పెద్ద స‌వాల్‌ గా మారింద‌ని అంఉట‌న్నారు. గత ఏడాది మాదిరిగా నగదు విషయంలో ఆన్‌ లైన్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించాలన్న ఆలోచన కూడా పందాల రాయుళ్ళు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలాఉండ‌గా...సంక్రాంతి పండగ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో కోడిపందేలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ 42 మంది తహ‌సిల్దార్లు - 49 మంది ఎస్సైలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదో వివరణ ఇవ్వాలని కోరామని ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. ఈ కేసును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ - జస్టిస్ జి శ్యాంప్రసాద్‌ తో కూడిన ధర్మాసనం విచారించింది. గత ఏడాది కోడి పందేల నిర్వాహకుల నుంచి రూ.9.23 లక్షల సొమ్మును స్వాధీనం చేసుకున్నామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కలిదిండి రామచంద్రరాజు కోడిపందేల జరగకుండా నిరోధించడంలో అధికారులు విఫలమయ్యారంటూ దాఖలు చేసిన పిటిషన్‌ ను హైకోర్టు విచారించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వం ఉదాసీన వైఖరి పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని ‘కోట్లాది రూపాయలు కోడిపందేల నిర్వహణ సందర్భంగా చేతులు మారుతున్నాయి. కాని అధికారులు కేవలం రూ.9లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం సీరియస్‌ గా వ్యవహరించడం లేదనేందుకు ఇది నిదర్శనం` అని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. బాధ్యులైన అధికారుల పట్ల చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా ఏజీ జోక్యం చేసుకుని అదనపు అఫిడవిట్‌ ను కూడా దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. హైకోర్టు స్పందిస్తూ `పశ్చిమగోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావ‌రి - గుంటూరు - విశాఖపట్నం జిల్లాలకు కూడా కోడిపందేలు విస్తరించాయి. తిరుపతి నుంచి కూడా పశ్చిమగోదావరి జిల్లాకు అనేక మంది వెళ్లి కోడిపందేల జూదం ఆడుతున్నారు. ఈ సారి హైకోర్టు కోడిపందేల జూదాన్ని ఎలా నిరోధిస్తారో నిశితంగా చూస్తుంది` అని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసింది పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేస్తూ నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.