Begin typing your search above and press return to search.

ఏపీలో కోడి పందాలు ఇంత హైటెక్కా?

By:  Tupaki Desk   |   15 Jan 2016 6:55 AM GMT
ఏపీలో కోడి పందాలు ఇంత హైటెక్కా?
X
ఏపీలో సంక్రాంతి పండగ ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మిగిలిన పండగలు ఎలా ఉన్నా.. పెద్ద పండగైన సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆ హడావుడే వేరుగా ఉంటుంది. మూడు రోజుల పాటు సాగే సంక్రాంతి పండగ సందర్భంగా కోడి పందాల ఓ రేంజ్ లో సాగుతాయి. కోట్లాది రూపాయిలు చేతులు మారే ఈ కోడి పందాల్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంటారు.

సంప్రదాయ క్రీడలైన కోడి పందాలపై కోర్టులు గుర్రుగా ఉన్నా.. జనాల్లో మాత్రం ఆసక్తి తగ్గలేదు సరికదా.. ఈ ఏడాది కోడి పందాల కోసం చేసిన ఏర్పాట్లు చూస్తే అవాక్కు కావాల్సిందే. భారీ ఎత్తున నిర్వహిస్తున్న కోడి పందాలకు సంబంధించి ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేయటం.. వందలాదిగా వచ్చే వాహనాల్ని నియంత్రించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లే కాదు.. వాటిని సమన్వయం చేయటానికి వాకీ టాకీలు పట్టుకొని తిరిగే సిబ్బంది కనిపిస్తున్నారు.

ఇంతేకాదు.. కోడి పందాల నిర్వహణ ఉదయం మొదలు అర్థరాత్రి దాటే వరకూ సాగుతోంది. రాత్రి వేళ.. పందాలు మరింత రంజుగా సాగేందుకు వీలుగా.. భారీ ఫ్లెడ్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. మరి.. ఈ పందాల్ని చూసేందుకు తరలి వచ్చే వేలాదిమందికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా.. పెద్ద పెద్ద ఎల్ ఈడీ తెరల్ని సిద్ధం చేశారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. కోడి పందాల్ని చిత్రీకరించటానికి బుజ్జి బుజ్జి డ్రోన్లను వినియోగిస్తూ.. వాటికి కెమేరాలు కట్టి మరీ పందాల్ని రికార్డు చేస్తున్నారు. ఎక్కడో మారుమూల ఉన్న గోదావరిజిల్లాల్లో సాగే కోడి పందాలు మరీ ఇంత హైటెక్కుతో ఉంటాయా? అని పోటీల కోసం హైదరాబాద్ తో సహా వివిధ జిల్లాల నుంచి వస్తున్నవారు విస్మయం చెందుతున్న పరిస్థితి.