Begin typing your search above and press return to search.

ఆరోగ్యశ్రీని పెంచి.. సీఎంఆర్ఎఫ్ ను తుంచేయటమా జగన్?

By:  Tupaki Desk   |   22 Nov 2020 9:15 AM IST
ఆరోగ్యశ్రీని పెంచి.. సీఎంఆర్ఎఫ్ ను తుంచేయటమా జగన్?
X
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి సంక్షేమ కార్యక్రమాలకు.. పథకాలకు పెద్దపీట వేయటం తెలిసిందే. ఖర్చు గురించి ఆలోచించకుండా దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించే ఏపీ సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురి చేసేలా ఉంది. ఇటీవల వెయ్యి రూపాయిలు దాటిన ఆసుపత్రి బిల్లు ఏదైనా సరే ఆరోగ్యశ్రీ కింద పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు.

అంతేకాదు.. గతంలో 1375 శస్త్ర చికిత్సల స్థానే 2434 సర్జరీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ నిర్ణయాన్ని పలువురు అభినందించారు. ఇలాంటివేళ.. ఇప్పటివరకు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి సౌకర్యాన్ని పరిమితం చేస్తూ.. ఆదేశాలు జారీ చేయటం మింగుడుపడనిదిగా మారింది. ఆరోగ్య శ్రీ పరిధిలో లేని ఒకట్రెండు సర్జరీలకు తప్పించి.. మిగిలిన వాటికి అవకాశంగా లేదంటూ ఏపీలోని ఎమ్మెల్యేలకు తాజాగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు.

ఆరోగ్య శ్రీ సేవల్ని పెంచటాన్ని ఎవరూ కాదనరు. అందరూ స్వాగతిస్తారు. అదే సమయంలో.. పేదలకు.. దిగువ మధ్యతరగతి.. మధ్యతరగతి వారికి అండగా ఉండే ముఖ్యమంత్రి సహాయ నిధికి కత్తెర వేయటాన్ని ఎవరూ జీర్ణించుకోలేరు. ఈ విషయంపై నిర్ణయం ముఖ్యమంత్రి తనకు తానే సొంతంగా తీసుకున్నారా? ఎవరైనా ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా తీసుకున్నారా? అన్నది తేలటం లేదు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి కోత పెట్టటం ద్వారా వచ్చే చిక్కేమిటంటే.. అన్ని శస్త్రచికిత్సలు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండవు. ఇలాంటి వాటికి ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేసేవారు. లేదంటే.. రోగి తనకు నచ్చిన చోటుకు వెళ్లి చికిత్స తీసుకునేవారు. ఆ బిల్లుల్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపేవారు. ఇప్పుడు అలాంటివేమీ ఉండవని చెప్పటం సంచలనంగా మారింది. ఎందుకంటే.. ఏపీలో ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే ఆసుపత్రులు 450 మాత్రమే ఉన్నాయి. మొత్తం ఆసుపత్రుల్లో కేవలం 30 నుంచి 40 శాతం మాత్రమే అందుబాటులోకి ఉంటాయి. తాజా నిర్ణయంతో ముఖ్యమంత్రి సహాయనిధి మీద ఆశలు పెట్టుకున్న వారందరికి శరాఘాతంగా మారిందన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఆదేశాల్ని ముఖ్యమంత్రి జగన్ మరోసారి రివ్యూ చేస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.