Begin typing your search above and press return to search.

నాన్ బెయిలబుల్ కింద అరెస్టు చేస్తే బెయిల్ రావటమా? సీఎం జగన్ క్వశ్చన్

By:  Tupaki Desk   |   10 Nov 2020 11:15 AM IST
నాన్ బెయిలబుల్ కింద అరెస్టు చేస్తే బెయిల్ రావటమా? సీఎం జగన్ క్వశ్చన్
X
ఏదైనా విషయం మీద కమిట్ మెంట్ ఎలా ఉండాలన్న అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతల్లో చూపించిన వైనం ఆసక్తికరంగా మారింది. నంద్యాలలో ఒక మైనార్టీ కుటుంబం అక్కడి పోలీసు అధికారుల వేధింపులకు తట్టుకోలేక సామూహిక ఆత్మహత్యలకు పాల్పడటం తెలిసిందే. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంపై ఏపీ సీఎం జగన్ స్పందించటమే కాదు.. ప్రత్యేకంగా విచారణ అధికారుల్ని నియమించాలని డీజీపీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సీనియర్ అధికారుల్ని నియమించారు.

వారు రంగంలోకి దిగిన 24 గంటల్లో సదరు కుటుంబం ఆత్మహత్య చేసుకోవటానికి కారణమైన నంద్యాల వన్ టౌన్ సీఐతో పాటు పోలీసు కానిస్టేబుల్ ను అరెస్టు చేశారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టు చేసిన వీరికి అనూహ్యంగా బెయిల్ రావటంపై రాజకీయ పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఆందోళన చేపట్టేందుకు నిర్ణయించాయి. ఆందోళనలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్న వేళ.. సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన తర్వాత బెయిల్ ఎలా వస్తుందని ప్రశ్నించటమే కాదు.. బెయిల్ రద్దుకు పిటిషన్ వేయాలని సూచన

దీంతో.. ఇరువురు పోలీసులకు లభించిన బెయిల్ రద్దు చేస్తూ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. నిందితులకు బెయిల్ ఇవ్వటం వల్ల సాక్షుల్ని బెదిరించి.. భయపెట్టి కేసు దర్యాప్తును ఆటంకపర్చే వీలుందని కోరారు. అందుకే.. వారికిచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారు ఏదైనా విషయాన్ని ఉన్నతాధికారికి చూడమని చెప్పి వదిలేస్తుంటారు. కానీ.. జగన్ మాత్రం.. ఎప్పటికప్పుడు ఆ కేసు అప్డేట్ తెలుసుకోవటమే కాదు.. ఆ విషయంలో ఏమేం చేయాలన్న అంశంపై ఇస్తున్న ఆదేశాలు చూస్తే.. ఒక విషయంపై జగన్ కమిట్ మెంట్ ఇంతలా ఉంటుందా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.