Begin typing your search above and press return to search.

సడన్ గా జగన్ ఢిల్లీ టూర్.. కారణం ఏమిటి?

By:  Tupaki Desk   |   22 Sept 2020 1:00 PM IST
సడన్ గా జగన్ ఢిల్లీ టూర్.. కారణం ఏమిటి?
X
ఎంత కఠినమైన ఇనుమైనా సరే.. ఒక స్థాయి వేడికి కరగటం మొదలవుతుంది. ఎటు కావాలంటే అటు తిప్పటానికి వీలవుతుంది. రాజకీయాల్లోనూ అంతే.. అన్ని అనుకున్నంతనే జరిగిపోవు. కొన్నింటికి సరైన సమయం.. సందర్భం చాలా అవసరం. ఈ విషయాన్ని గుర్తించిన వారికి రాజకీయాల్లో తిరుగు లేదని చెబుతారు. ఇలాంటి టాలెంట్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుష్కలంగా ఉందంటారు.

చడీ చప్పుడు లేకుండా.. ముందుస్తుగా ప్రస్తావన లేకుండా దేశ రాజధానికి ఢిల్లీ టూర్ చేస్తున్న జగన్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ఓవైపు భారీగా నమోదవుతున్నకరోనా కేసులు.. ఇంకోవైపు బోలెడన్ని వివాదాలు.. ప్రతిపక్ష నేతను ఫిక్స్ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో ఫుల్ బిజీగా ఉన్న సీఎం.. రెండు రోజుల పాటు హస్తినలో ఉండేందుకు డిసైడ్ కావటం ఎందుకన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఈ రోజు (మంగళవారంఊ సాయంత్రం మూడు గంటలకు ఢిల్లీకి వెళ్లనున్న జగన్.. రెండు రోజుల పాటు దేశ రాజధానిలోనే ఉండనున్నారు. తాజా టూర్ లో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రుల్ని కలిసే అవకాశం ఉందంటున్నారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మరో మంత్రి హర్షవర్ధన్ లతో భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఇంత ఆకస్మికంగా ఢిల్లీకి సీఎం జగన్ ఎందుకు వెళుతున్నారు? దాని వెనుక కారణాలేమిటి? అన్న ప్రశ్నలకు ఆసక్తికరంగా మారాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వ్యవసాయ బిల్లును తాను అనుకున్నట్లుగా పాస్ చేసుకున్న వేళ.. అందుకు తన మద్దతును శక్తిమేర అందించిన జగన్ సరైన సమయంలో ఢిల్లీ టూర్ చేస్తున్నట్లు చెబుతున్నారు. తాను అందించిన సాయానికి తగినట్లుగా రాష్ట్రానికి మేలు జరిగేలా చేయటం.. రాజకీయంగా తాను తీసుకునే నిర్ణయాల గురించి వివరించటం లాంటివి కూడా తాజా టూర్ లో ఉంటాయంటున్నారు.

అంతేకాదు.. కొన్ని కీలక నిర్ణయాలపై కేంద్రం మూడ్ తెలుసుకునేందుకు జగన్ టూర్ ఉందంటున్నారు. విపక్ష నేత చంద్రబాబు.. లోకేశ్ ల మీద అమరావతితో పాటు.. పలు అవినీతి ఆరోపణలు మీడియాలో వస్తున్న వేళ.. వాటికి తగ్గట్లుగా చర్యలు తీసుకునే విషయంలో కీలక నిర్ణయాలపై చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లుతున్న రాష్ట్రానికి ఉపశమనం కలిగించేలా సాయం కోసం ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.

ఏమైనా.. తాజా ఢిల్లీ పర్యటన ఆద్యంతం వ్యూహాత్మకమని అభివర్ణిస్తున్నారు.