Begin typing your search above and press return to search.

కరోనా పై సీఎం జగన్ కీలక నిర్ణయం ..రూ. 200 కోట్లు సిద్ధం !

By:  Tupaki Desk   |   6 March 2020 12:30 PM GMT
కరోనా పై సీఎం జగన్ కీలక నిర్ణయం ..రూ. 200 కోట్లు సిద్ధం !
X
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను సైతం వణికిస్తోంది. తాజాగా తెలంగాణలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో... అటు ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇవాళ అధికారులతో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో పాటు... వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహార్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.

ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ ... కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేయవద్దు అని ,వెంటనే కరోనాపై కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రూ.200 కోట్లు సిద్ధంగా ఉంచాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే విజయవాడ, అనంతపురంలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ఏపీలో కరోనా నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో గ్రామ సచివాలయాలను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. కరోనా వైరస్ విషయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. ఏపీలో ఇప్పటివరకు నమోదైన 24 అనుమానిత కేసుల్లో 20 నెగెటివ్ వచ్చాయని, నాలుగు కేసులకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉందని జగన్ కు ఈ సందర్భం గా వైద్య శాఖ అధికారులు తెలిపారు. అలాగే విశాఖ విమానాశ్రయానికి వచ్చిన వారిలో నిన్నటి వరకు 6927 మందికి, నౌకల ద్వారా వచ్చిన 790 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. అలాగే ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పై ఒక్క కేసు కూడా పాజిటివ్ గా నమోదు కాలేదు అని , ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.