Begin typing your search above and press return to search.

సమ్మెపై సీఎం నోట సుప్రీం మాట.. కారణం ఇదేనా?

By:  Tupaki Desk   |   6 Nov 2019 7:11 AM GMT
సమ్మెపై సీఎం నోట సుప్రీం మాట.. కారణం ఇదేనా?
X
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సంధించిన సమ్మె అస్త్రం కేసీఆర్ సర్కారుకు ఏ మాత్రం మింగుడుపడని రీతిలో మారింది. రాజకీయంగా తాను ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న భావనను హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం పటాపంచలు చేయటంతో సీఎం కేసీఆర్ లో ఆత్మవిశ్వాసం టన్నుల కొద్దీ పెరిగిందని చెప్పాలి. తెలంగాణలో తనకు ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదన్న నమ్మకంతో ఉన్న గులాబీ బాస్.. ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగా ఉండాలని భావిస్తున్నారు.

మరో పదేళ్ల వరకూ తానే సీఎంనని బలంగా నమ్మె కేసీఆర్.. రానున్న రోజుల్లో ఉద్యోగుల విషయంలో పలు సంస్కరణలు.. మార్పులు చేయాలన్న యోచనలో ఉన్నారు. వ్యవస్థలో పాతుకు పోయిన పలు ప్రభుత్వ విభాగాల్లో ఊహకు అందని రీతిలో మార్పులు చేయాలనన గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందులో మొదటిది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ వ్యవహరిస్తున్న వైఖరిగా చెప్పక తప్పదు.

గడిచిన 32 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ అంచనాలు తప్ప అయ్యాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.48 వేల మందికి పైగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల్లో 80 శాతానికి పైనే చిరుద్యోగులేనని.. వారి సగటు జీతం నెలకు రూ.35 వేల కంటే తక్కువేనని.. ఇలాంటి నేపథ్యంలో పది నుంచి పదిహేను రోజులకు మించి సమ్మె చేసే సత్తా లేదన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

తన అంచనాలకు భిన్నంగా 32 రోజులుగా సమ్మె చేయటం ఒక ఎత్తు అయితే.. తాము పని చేసిన సెప్టెంబరు నెల జీతాల్ని కూడా అందని నేపథ్యంలో మొత్తంగా రెండు నెలల పాటు జీతాల్లేక విల విలలాడటం ఖాయమని..అదే జరిగితే సమ్మెకు చెల్లుచీటి చెప్పి విధుల్లో చేరుతారన్న నమ్మకంలో ప్రభుత్వం ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ కారణంతోనే.. సమ్మెను వీలైనంతగా పొడిగించటం ద్వారా.. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల్లో చీలిక తేవాలన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.

తామెంత పోరాడినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించదన్న సంకేతాల్ని స్పష్టం చేయటంతో పాటు.. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా.. సుప్రీంకోర్టు తలుపు తట్టటం ద్వారా.. కాలం గడిచేలా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాము చెప్పినట్లు వినని ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు పెరిగే కొద్దీ తాము చెప్పిన మాటను తూచా తప్పకుండా వింటారన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న మాట వినిపిస్తోంది.

హైకోర్టు లో తీర్పు తమకు ప్రతికూలంగా వచ్చినా.. సుప్రీంకోర్టు తలుపు తడతామన్న రాష్ట్ర ప్రభుత్వపు మాట వెనుక పక్కా వ్యూహం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాలయాపనతో ఆర్టీసీ ఉద్యోగుల్ని ఆర్థికంగా బలహీనం చేయటమే సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. దీనికి విరుగుడుగా ఆర్టీసీ సంఘాలు ఎలా ప్లాన్ చేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.