Begin typing your search above and press return to search.

ధోనికి సీఎం స్టాలిన్ అంత వీరాభిమానా?

By:  Tupaki Desk   |   21 Nov 2021 6:32 AM GMT
ధోనికి సీఎం స్టాలిన్ అంత వీరాభిమానా?
X
సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలన్న ఆకాంక్షను చాలా ఆలస్యంగా తీర్చుకున్న రాజకీయ అధినేత ఎవరైనా ఉన్నారంటే అది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాత్రమే. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ.. సీఎం కుర్చీలో కూర్చోవటానికి ఆయనకు పట్టిన సమయం మిగిలిన వారికి చాలా భిన్నంగా ఉంటుంది. అయితే.. ఎవరూ ఊహించనిరీతిలో సీఎంగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి.

వేలెత్తి చూపించే అవకాశం లేని రీతిలో జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. ఎప్పటికప్పుడు ఆసక్తికర నిర్ణయాలతో.. దేశంలోని మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు సైతం స్టాలిన్ బాటలో నడవాలన్నట్లుగా ఆయన ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. ప్రతి సందర్భాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవటమే కాదు..తమిళ ప్రజలకు సరికొత్త రాజకీయాన్నిపరిచయం చేస్తున్న స్టాలిన్.. తన గ్రాఫ్ ను అద్భుతంగా పెంచేసుకుంటున్నారు.

రాజకీయాలు అన్నంతనే విమర్శలు.. ఘాటు వ్యాఖ్యలు.. పగ.. ప్రతీకారాలు.. రాజకీయ దాడులు లాంటివి సహజంగా మారిపోయిన వేళ.. విపక్షలు సైతం ఆయన మీద ఒక మాట అనేందుకు సాహసించలేని రీతిలో ప్రజల్లో అభిమానాన్ని పెంచేసుకుంటున్న వైనం తెలిసిందే. తాజాగా ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజా సీజన్ లో ఐపీఎల్ ట్రోఫిని గెలుచుకున్న చెన్నై జట్టు తన ట్రోఫీని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించిన కార్యక్రమం ఒకటి జరిగింది.

ఐపీఎల్ లో తమిళనాడు జట్టు యజమాని అయిన శ్రీనివాసన్ తో పాటు.. ఆ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను తమిళనాడు ముఖ్యమంత్రిగా రాలేదంటూ స్టాలిన్ వ్యాఖ్యానిస్తూ.. తాను ఎంఎస్ ధోనీకి పెద్ద ఫ్యాన్ అన్న కొత్త విషయాన్ని ఆయన రివీల్ చేశారు. ధోనీ జార్ఖండ్ కు చెందిన వాడే అయినప్పటికీ తమిళనాడు ప్రజల కోసం వచ్చినట్టుందని వ్యాఖ్యానించారు. ధోనీ తమిళ ప్రజానీకంలో ఒకడిగా మారిపోయాడని వ్యాఖ్యానించారు.

మరెన్నో సీజన్ల పాటు చెన్నై జట్టుకు ఎంఎస్ దోనీ నాయకత్వం వహించాలన్న ఆకాంక్షను స్టాలిన్ వ్యక్తం చేశారు. స్టాలిన్ మాటలకు సభలో చప్పట్లు మారుమోగాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. చెన్నై జట్టు సభ్యుల సంతకాల జెర్సీని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు అందించారు. ఈ జెర్సీ మీద నెంబరు 7 స్టాలిన్ పేరు మీద ఉండటంమరింత ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. సీఎం స్టాలిన్ ఆకాంక్షకు తగ్గట్లే మహేందర్ సింగ్ ధోనీ తన ఫ్యూచర్ ప్లాన్ ను షేర్ చేసుకున్నారు. ఐపీఎల్ లో తాను ఆడే చివరి మ్యాచ్ ను చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆడతానని పేర్కొన్నారు. దీంతో.. 2022లోజరిగే ఐపీఎల్ లో చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తానన్న విషయాన్ని ధోనీ స్పష్టం చేశారని చెప్పాలి. తనలో ఇంకా సత్తా మిగిలి ఉందన్న ఆయన.. చెన్నై ప్రజల మంచితనాన్నిచెప్పి.. అందరి మనసుల్ని దోచేశారు.

గతంలో సచిన్ టెండూల్కర్ ముంబయి ఇండియన్స్ తరఫున తన చివరి మ్యాచ్ ను చెపాక్ స్టేడియంలోనే ఆడారని.. ఆ సందర్భంగా స్టేడియంలోని ప్రేక్షకులు లేచి నిలబడి సచిన్ కు అభివాదం చేయటంతో పాటు.. ఘనమైన వీడ్కోలు పలికారన్నారు. తన చివరి మ్యాచ్ కు వేదిక చెన్నై చెపాక్ స్టేడియం అన్న విషయాన్ని చెప్పటం ద్వారా ధోనీ చెన్నైతో తనకున్న అభిమానం ఎంతన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి.