Begin typing your search above and press return to search.

నిర‌స‌న‌ల‌కు పోటీగా దీక్ష చేస్తానంటున్న సీఎం

By:  Tupaki Desk   |   10 Jun 2017 4:52 AM GMT
నిర‌స‌న‌ల‌కు పోటీగా దీక్ష చేస్తానంటున్న సీఎం
X
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంద్‌ సౌర్‌ లో ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందడం త‌ద్వారా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటనపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి. నష్టనివారణ చర్యల్లో భాగంగా సీఎం చౌహాన్‌ స్వయంగా రంగంలోకి దిగారు. రేపటి నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానని ఆయన ప్రకటించారు. భోపాల్‌ లోని దసరా మైదానంలో దీక్ష చేపట్టనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేవరకు తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు.

అన్న‌దాత‌లు త‌మ‌ డిమాండ్ల గురించి త‌నతో చర్చించాలని ప్రజలను సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ ఆహ్వానించారు. కార్యక్రమం సందర్భంగా రైతుల సమస్యలను ఆయన స్వయంగా విని, వాటి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తాన‌ని తెలిపారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలేని రైతులకు రుణ పరిష్కార పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందని చౌహాన్ వెల్లడించారు.`రైతుల ఆందోళన నేపథ్యంలో ప్ర‌తి ఒక్కరు వచ్చి వారి సమస్యల గురించి నాతో చర్చించాలని కోరుతున్నాను. నేను నిరాహారదీక్ష చేపడతాను. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తాను` అని చౌహాన్‌ చెప్పారు. రైతులకు అన్నివిధాలా మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అయినా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండడంతో శాంతి కోసం నిరాహారదీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. కాగా, ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి దీక్ష‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/