Begin typing your search above and press return to search.

క్రికెట్ లాగే రాజ‌కీయం.... ఈ యువ‌నేత‌కు సీఎం కుర్చీ మిస్‌

By:  Tupaki Desk   |   10 Nov 2020 6:14 PM GMT
క్రికెట్ లాగే రాజ‌కీయం.... ఈ యువ‌నేత‌కు సీఎం కుర్చీ మిస్‌
X
దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నాలు కేంద్రీకృత‌మైన బీహార్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాలు ఉత్కంఠ భ‌రితంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఎన్నికలు పూర్తైన వెంటనే ఎగ్జిట్ పోల్స్ తమ సర్వే వివరాలను బయటపెట్ట‌గా ఒక్క సంస్థ మిన‌హా అన్ని ఎగ్జిట్ పోల్స్ మహాకూటమికి అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. అయితే, వాస్త‌వ ఫలితాలు దానికి విరుద్ధంగా ఉన్నట్టుగా ప్రస్తుతం వస్తున్న ఫలితాలను బట్టి అర్థం అవుతోంది. ఈ స‌మ‌యంలోనే ఆర్జేడీ యువ‌నేత తేజ‌స్వి యాదవ్ గురించి కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది.

బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ను గ‌ద్దె దించాల‌న్న ల‌క్ష్యంతో తేజ‌స్వి యాద‌వ్ ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ మ‌హాఘ‌ట్‌బంద‌న్‌కే ప‌ట్టం క‌ట్టాయి. ఎన్నిక‌ల ఫ‌లితాల రోజే తేజ‌స్వి యాద‌వ్ పుట్టిన రోజు కావ‌డంతో ఆయ‌న‌కు బీహార్ ప్ర‌జ‌లు పుట్ట‌న రోజు గిఫ్ట్ ఇస్తార‌ని అంతా అంచ‌నా వేశారు. అయితే, తేజ‌స్వికి నిరాశే ఎదురైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్డీయే 123 స్థానాల్లో మహాకూటమి 111 స్థానాల్లో, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజార్టీ మార్క్ ను ఎన్డీయే కూటమి దాటింది.

కాగా ఆర్జేడీ యువ‌నేత తేజస్వి వ్య‌క్తిగ‌త జీవితానికి ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మికి ప‌లువురు లింక్ పెడుతున్నారు. క్రికెటర్‌గా స‌త్తా చాటుకోవాలన్న‌ది తేజ‌స్వి డ్రీమ్‌. ఈ మేర‌కు ఈయ‌న ఢిల్లీలో చదువుతున్న రోజుల్లో క్రికెట్ సాధన చేశారు. ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు ఎంపికయ్యారు. 2008 నుంచి 2012 వరకు ఢిల్లీ తరఫున ప్లేయర్‌గా కొనసాగిన‌ప్ప‌టికీ, ఒక్క సారి కూడా జ‌ట్టులో ఆట‌గాడిగా పాల్గొనే అవ‌కాశం దొర‌క‌లేదు. ఎల్ల‌ప్పుడూ ఎక్స్‌ట్రా ప్లేయ‌ర్‌గానే ఎంపిక‌య్యారు. అనంత‌రం తండ్రి రాజ‌కీయంగా యాక్టివ్‌గా లేక‌పోవ‌డం, పార్టీని కాపాడుకోవ‌డం కోసం ఆర్జేడీలో చ‌క్రం తిప్ప‌డం మొద‌లుపెట్టారు. ఈ ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం అవ్వాల‌ని అనుకున్నారు. అయితే ఆ చాన్స్ కూడా క్రికెట్‌లో వ‌లే త‌ప్పిపోవ‌డంతో అటు క్రికెట్ ఇటు రాజ‌కీయాలు రెండూ ఆయ‌న‌కు అచ్చిరాలేద‌ని ప‌లువురు కామెంట్ చేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా, ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ కు 70 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 19చోట్ల మాత్రమే లీడింగ్‌లో ఉంది. సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసేందుకు ఆర్జేడీ అంగీకరించకుండా ఉంటె ఇప్పుడు ఫలితాలు మరోలా ఉండేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ 40 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చి, ఆర్జేడి 160కి పైగా స్థానాల్లో పోటీకి దిగినట్టయితే ఫలితాలు మహాకూటమికి అనుకూలంగా ఉండేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తేడా స్వల్పంగా ఉండటంతో పూర్తి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేత‌లకు సూచించారు.