Begin typing your search above and press return to search.

చివరకు సీఎం సహాయ నిధిని వదల్లేదుగా.. ఏపీలో భారీ దందా బయటకు

By:  Tupaki Desk   |   9 Oct 2020 11:15 AM IST
చివరకు సీఎం సహాయ నిధిని వదల్లేదుగా.. ఏపీలో భారీ దందా బయటకు
X
ఇవాల్టి రోజున మోసాలు లేని ప్లేస్ కనిపించదు. వీలు చిక్కితే చాలు.. ఎక్కడైనా.. ఏదైనా చోరీ చేసే దరిద్రపుగొట్టు రోజులు వచ్చేశాయి. దొంగతనం ఎక్కడ చేసినా.. అది బయటపడటం కాస్త ఆలస్యమవుతుంది. అధికారానికి కేంద్రమైన సీఎం పేషీకి సంబంధించి.. సీఎం పేరుతో నడిచే ముఖ్యమంత్రి సహాయ నిధినే కొల్లగొట్టే బరితెగింపు వ్యవహారం తాజాగా బయటకు వచ్చి సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి సహాయ నిధిలో భాగంగా జారీ చేసిన చెక్కులపై నగదును మార్చి.. బ్యాంకులను మాయ చేస్తూ కోట్లు కొల్లగొట్టేందుకు జరిగిన ప్రయత్నం ఏపీలో ఇప్పుడు సంచలనంగా మారింది.

పేదలకు అందాల్సిన సాయాన్ని తమ జేబులో వేసుకోవటానికి సాగిన దందా గురించి వివరాలు బయటకు రావటం షాకింగ్ గా మారింది. సాధారణంగా ఏపీలోని పలు ప్రాంతాల నుంచి తమ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. ఖరీదైన వైద్యం చేసుకునేందుకు అవసరమైన డబ్బులు తమ వద్ద లేవని.. తమకు సాయం చేయాలంటూ నిత్యం పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తుంటాయి. అలాంటి వాటిని వడబోసి కొన్నింటికి ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సంబంధిత రోగికి ఫోన్ చేయటం.. వివరాల్ని క్రాస్ చెక్ చేయటం చేస్తారు.

ఇదిలా ఉండగా.. ఈ మధ్యన గుంటూరుకు చెందిన రోగికి సాయం చేసే క్రమంలో అతడికి ఫోన్ చేశారు. దరఖాస్తులోని వివరాలు కొంత అనుమానాస్పదంగా రావటంతో విచారణ జరిపించారు. రోగి ఐపీ నెంబరు.. సదరు రోగి చేయించుకున్న ఆపరేషన్ వివరాలు కరెక్టుగానే ఉన్నాయి కానీ.. రోగి ఆధార్ నెంబరు మాత్రం వేరేగా ఉండటాన్ని గమనించారు. దీనిపై లోతుగా విచారణ చేస్తే.. దారుణమైన మోసాన్ని గుర్తించారు. సీఎం సహాయం కోసం వచ్చే అప్లికేషన్లలో పెద్ద ఎత్తున ఫేక్ దరఖాస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. నెలలో ఇలాంటివి 200 వరకు ఉన్నట్లుగా తేల్చిన విచారణ అధికారులు షాక్ తిన్నారు.

ఇంతకీ ఈ భారీ స్కాం ఎలా సాగుతుందన్న విషయంపై విచారణ చేసిన అధికారులు అసలు విషయాల్ని గుర్తించారు. సొంత డబ్బులతోనో.. అప్పులు చేసి వైద్యం చేయించుకున్న వారిని ఈ ముఠా టార్గెట్ చేస్తుంది. వారి పేర్లు.. ఆధార్ నెంబర్లు మార్చేస్తారు. ఫేక్ దరఖాస్తును సిద్ధం చేస్తారు. ఎవరో ఒక ఎమ్మెల్యే వద్దకు వెళ్లి.. వారిచ్చినట్లుగా లేఖ తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అప్లై చేస్తారు. ఎమ్మెల్యే జారీ చేసిన లేఖ ఉండటంతో చాలా వరకు.. అలాంటి దరఖాస్తుల్ని ఓకే చేస్తారు. అనుమానం వచ్చి లోతుగా చెక్ చేస్తే.. సీఎం సహాయ నిధికే కన్నం వేసిన దుర్మార్గుల వ్యవహారం బయటకు వచ్చింది.