Begin typing your search above and press return to search.

బిహార్ ఎపిసోడ్ తో కేసీఆర్ ను దెబ్బేసిన నితీశ్

By:  Tupaki Desk   |   10 Aug 2022 5:53 AM GMT
బిహార్ ఎపిసోడ్ తో కేసీఆర్ ను దెబ్బేసిన నితీశ్
X
నితీశ్ ఏంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను దెబ్బేసుడేంది? అన్న డౌట్ అక్కర్లేదు. విషయాన్ని కాస్తంత లోతుగా చూస్తే అసలు సంగతి అర్థం కావటం ఖాయం. బీహార్ లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు మోడీషాలకు దిమ్మ తిరిగిపోయేలా షాకివ్వటమేకాదు.. పని లో పనిగా బీహార్ కు వందలాది కిలోమీటర్లు దూరంలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను అనూహ్య షాక్ తప్పలేదన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం.. నితీశ్ కు ఉన్న స్టేచరే అని చెప్పాలి.

ఇవాల్టి రోజున ఎవరైనా అధినేత తమను దెబ్బేయాలని డిసైడ్ అయితే..దాన్ని సదరు అధినేత బుర్రలోకి వచ్చిన వెంటనే గుర్తించే సామర్థ్యం.. సత్తా మోడీషాలకు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంటుంది. అలాంటిది తాము సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన నితీశ్ అంతలా మోడీషాలను దెబ్బేసిన తీరు ఇప్పుడు కొత్తచర్చకు తెర తీసినట్లుగా చెప్పాలి. మోడీకి ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ఛరిష్మా ఉన్న నేతలు ఎవరూ కనిపించని పరిస్థితి. బెంగాల్ బెబ్బులిగా... ఫైర్ బ్రాండ్ గా అభివర్ణించే మమతా బెనర్జీ సైతం మోడీషాలతో పెట్టుకునే కన్నా.. బెంగాల్ రాష్ట్రాన్ని చూసుకుంటే సరిపోతుందన్నట్లుగా ఆమె తీరు ఉండటం తెలిసిందే.

ఇక.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని తాపత్రయపడుతున్నా.. ఆయన స్థాయి సరిపోవటం లేదు. మంచి మాటకారి అయినప్పటికీ ఆయన తీరు.. ఇతర పార్టీలతో వ్యవహరించే విధానాల విషయంలో ఆయన సరైన నమ్మకస్తుడు కాదన్న భావన పలు పార్టీల్లో ఉన్నట్లు చెబుతున్నారు.

దీనికి తోడు మోడీకి ప్రత్యామ్నాయంగా ఒక విభజన వాదిగా పేరున్న కేసీఆర్ ను ఎలా అంగీకరిస్తామన్న మాట పలువురు అధినేతల్లో వినిపిస్తూ ఉంటుంది. విలువలతో కూడిన రాజకీయాల విషయంలో కేసీఆర్ అనుసరించే విధానాలతో ఆయనకు మంచి పేరు లేని పరిస్థితి. అన్నింటికి మించి ప్రజాస్వామ్య భారతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఒక అధినేత.. ఎనిమిదేళ్లుగా సచివాలయానికి వెళ్లని తీరు కేసీఆర్ లో మాత్రమే కనిపిస్తుంది.

అలాంటి నేతను.. ప్రధాని అభ్యర్థిగా అంగీకరించేందుకు చాలా పార్టీలు సిద్ధంగా లేవని చెబుతారు. ఇలాంటి వేళ.. నితీశ్ కుమార్ బెస్ట్ ఆప్షన్ అవుతారు. బీహార్ లాంటి జంగిల్ రాజ్ ను ఒక గాడిన పెట్టటంతో పాటు.. డెవలప్ మెంట్ అంటే ఏమిటో చూపించటం..అవినీతి మరక అంటకుండా పాలన సాగించటం లాంటివి కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు. దీనికి తోడు.. మోడీషాలను ఎలా కంట్రోల్ చేయాలన్న విషయంలో నితీశ్ తీరు కాస్త భిన్నంగా ఉంటుందని చెబుతారు. మోడీ లాంటి నేతను తన నిర్ణయాలతో దెబ్బేయటం అంత తేలిక కాదు.

అన్నింటికి మించి.. బలం లేకున్నా బీజేపీని ఒప్పించి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పాలన సాగించటం అంత సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి మేజిక్కులెన్నో చేసిన నితీశ్.. మోడీకి ప్రత్యామ్నాయం అంటే ఓకే అని చెప్పొచ్చంటున్నారు. ఇలా మారిన సీన్ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంట పుట్టేలా ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

బీహార్ లో చోటు చేసుకున్న తాజా పరిణామాలతో మోడీకి అసలుసిసలు షాకిచ్చే సత్తా కేసీఆర్ కంటే నితీశ్ కే ఎక్కువన్న విషయం మరింత స్పష్టత రావటం ఖాయం. అదే జరిగితే.. కేసీఆర్ కు దెబ్బ పడిందని చెప్పక తప్పదు.