Begin typing your search above and press return to search.

ఎక్కువ మాట్లాడితే నన్ను ఓడిస్తారేమో: డిప్యూటీ సీఎం

By:  Tupaki Desk   |   29 Dec 2021 4:00 PM IST
ఎక్కువ మాట్లాడితే నన్ను ఓడిస్తారేమో: డిప్యూటీ సీఎం
X
సినిమా టికెట్ల వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా కూడా వారసత్వంగా మారిపోయిందన్నారు. 50 ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమపై మూడు కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతోందని.. కొత్త వారికి థియేటర్లు కూడా ఇవ్వడం లేదన్నారు. రాజకీయాల్లో వారసత్వం గురించి మాట్లాడుతారని.. మరి సీనీ రంగంలో వారసత్వం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

నిర్మాత నష్టపోయినప్పుడు హీరోలు ఆదుకోరని.. హీరోలు తమ రెమ్యూనరేషన్ ఎందుకు చెప్పడం లేదని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. సినిమా రంగంలో కొత్త వారికి అవకాశాలు లేవన్నారు. బహుశా ఇలా మాట్లాడినందుకు తనను ఓడించే ప్రయత్నం చేస్తారేమోనని సెటైర్లు పేల్చారు. పేదలకు సినిమా చూపిస్తారని.. వారిని మాత్రం ఆదుకోరని అన్నారు.

ఏపీ సినిమా టికెట్ల వ్యవహారంపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ 3 కుటుంబాల చేతిలో ఉందని.. వారి ఆధిపత్యమే కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. పేదవాళ్లు కూడా సినిమా చూడాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ చర్యలు చేపట్టారన్నారు.

బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కూడా కౌంటర్ ఇచ్చాడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. మందు పోసి ఓట్లు అడుక్కునే దుస్థితికి ఏపీ బీజేపీ దిగజారిపోయిందని సెటైర్ వేశాడు. సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడా? సారాయి దుకాణాలకు అధ్యక్షుడా? అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, ఆరోగ్యం, అభివృద్ధి వంటి వాటిలో ముందడుగు వేయాలన్నారు. ప్రజలు అనారోగ్యం పాలయ్యే మద్యాన్ని అతి తక్కువ ధరకు ఇస్తామని బహిరంగ సభలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.