Begin typing your search above and press return to search.

జోరున వర్షం పడుతున్న వేళ.. ఆసుపత్రిలో సీఎం సతీమణి?

By:  Tupaki Desk   |   14 Oct 2020 9:15 AM IST
జోరున వర్షం పడుతున్న వేళ.. ఆసుపత్రిలో సీఎం సతీమణి?
X
మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ లో జోరున కురుస్తున్న వాన.. సాయంత్రం ఆరు తర్వాత మరింత పెరిగింది. కాలంతో పోటీ పడినట్లుగా.. గంట గంటకు వర్షం అంతకంతకూ ఎక్కువ పడుతున్న వేళ.. ప్రగతిభవన్ లో హడావుడి నెలకొన్నట్లుగా చెబుతున్నారు. ఆరోగ్యం బాగా లేని సీఎం కేసీఆర్ సతీమణి శోభను.. ఒకసారి ఆసుపత్రికి వెళితే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

దీంతో.. జోరుగా వర్షం పడుతున్న వేళ.. ప్రగతి భవన్ నుంచి నగరంలోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. రాత్రి ఎనిమిది గంటల వేళలో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనారోగ్యానికి కారణం ఏమైందన్న విషయం బయటకు రావటం లేదు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత నుంచి దాదాపు రెండు గంటలకు పైనే వివిధ వైద్య పరీక్షలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల ఆమె ఆరోగ్యం సరిగా ఉండటం లేదంటున్నారు. ఈ కారణంతోనే.. కుమార్తె కవిత ఎమ్మెల్సీగా విజయం సాధించి.. ప్రగతి భవన్ కు వచ్చిన వేళలోనూ ఆమె బయటకు రాలేదన్న వాదన వినిపిస్తోంది. అనారోగ్యంతో ఉన్న ఆమె విశ్రాంతి తీసుకోవటంతో కవితనే.. వెళ్లి పలుకరించి వచ్చినట్లుగా తెలుస్తోంది. వైద్య పరీక్షల తర్వాత ఆమెను ప్రగతిభవన్ కు తీసుకెళ్లారా? లేదంటే.. ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స చేస్తున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.