Begin typing your search above and press return to search.

మరో వరాన్ని ఇచ్చేసిన సీఎం కేసీఆర్.. వారికి భారీ ఉపశమనం

By:  Tupaki Desk   |   5 April 2021 11:00 AM IST
మరో వరాన్ని ఇచ్చేసిన సీఎం కేసీఆర్.. వారికి భారీ ఉపశమనం
X
హామీలు ఇవ్వటం రాజకీయ నేతలకు అలవాటే. వాటిని అమలు విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. హామీలు ఇచ్చేటప్పుడు ఉండే ఉత్సాహం.. అమలు విషయంలో మాత్రం పెద్దగా కనిపించదు. ఈ తీరుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో వరుస ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో.. తన వ్యూహాన్ని మార్చి.. సంక్షేమ పథకాల అమలు.. వివిధ వర్గాల వారికిచ్చే హామీల్ని అమలు చేయటంలో వేగాన్ని పెంచటం ద్వారా దూరమైన వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ పెంచటంతో పాటు..రిటైర్మెంట్ వయసును పెంచటం.. ఇలా పెండింగ్ లో ఉన్న ఒక్కొక్క హామీని అమల్లోకి తెచ్చేస్తున్నారు. తాజాగా మరో హామీని అమల్లోకి తీసుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ కు జరిగిన ఎన్నికల వేళ.. సెలూన్.. లాండ్రీ షాపులు.. ధోబీఘాట్లకు నెలకు 250యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తామని చెప్పటం తెలిసిందే.

తాజాగా ఆ హామీని అమల్లోకి తీసుకొచ్చారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త హామీని అమల్లోకి తీసుకురావటమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా వర్తింపచేయాలని నిర్ణయించారు. తాజా నిర్ణయంతో.. లక్షల మంది రజక.. నాయి బ్రాహ్మణ కుటుంబాలకు లబ్థి చేకూరుతుంది. ఉచిత విద్యుత్ తో మెషిన్ల వినియోగాన్ని పెంచటం ద్వారా.. శారరీక శ్రమ తగ్గే వీలుంది. దీంతో.. వెనుకబడిన వర్గాల్లోని వారికి మేలు కలుగనుంది.