Begin typing your search above and press return to search.

కేసీఆర్ వెంట వెళ్లి వణికినోళ్లంతా..ఇప్పుడు హాయిగా ఫీల్ అవుతున్నారట

By:  Tupaki Desk   |   1 Jun 2021 2:00 PM IST
కేసీఆర్ వెంట వెళ్లి వణికినోళ్లంతా..ఇప్పుడు హాయిగా ఫీల్ అవుతున్నారట
X
కరోనాకు తర తమ బేధాల్లేవన్న సంగతి తెలిసిందే. సామాన్యుడైనా.. సెలబ్రిటీ అయినా ఒక్కటే. చిన్న తేడా కొట్టినా పట్టేసే ఈ మాయదారి మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచమే ఆగం పట్టిన పరిస్థితి. ఇలాంటివేళ.. కరోనా వైరస్ తో తీవ్ర అస్వస్థతకు గురైన రోగుల్ని నేరుగా.. అది కూడా ముఖానికి ఎన్ 95 మాస్కు పెట్టుకొని పరామర్శించటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ.. ఆ సాహసాన్ని చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రితో పాటు.. వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన ఆయన ట్రెండ్ సెట్టర్ గా మారారు. దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని అరుదైన ఫీట్ ను చేసినట్లుగా పలువురు ఆయన్ను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఒకవేళ.. నిజంగా అదే నిజమైతే.. మొదటి వేవ్ లో ఆయన ఎందుకీ సాహసాన్ని చేయలేదన్న ప్రశ్నకు సమాధానం రాదు. గాంధీకి రావటానికి కొద్ది రోజుల ముందే.. ఆయన కరోనా నుంచి కోలుకోవటం.. పెద్ద ఎత్తున యాంటీ బాడీలు ఆయనలో ఉంటాయి కాబట్టి.. అంత రిస్కు అయితే ఉండదన్న మాట వినిపించింది.

కేసీఆర్ వరకు ఓకే. కానీ.. ఆయనతోపాటు గాంధీలోని ఐసీయూ వార్డుల్లో తిరిగిన మిగిలిన వారు పలువురు కరోనా భయంతో వణికినట్లుగా చెబుతారు. ముఖ్యమంత్రి వెళ్లినప్పుడు ఆయన వెంట తప్పనిసరిగా వెళ్లాల్సిన వారికి మరో ఆప్షన్ ఉండదు. ఆ మాటకు వస్తే.. అవన్నీ ఆలోచించే టైం ఉండదు. సీఎం వెంట వెళ్లేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటి కరోనా ప్రమాదం పొంచి ఉందనే భావనలోనే పలువురు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ వెంట గాంధీ.. ఎంజీఎంలో వెళ్లిన వారిలోని కొన్ని కుటుంబాల వారు తీవ్రమైన ఆందోళనకు గురైనట్లు చెబుతారు. పెను ముప్పు పొంచి ఉందన్న భయానికి వారు గురైనట్లు చెబుతారు. ఈ ఆసుపత్రుల సందర్శన తర్వాత.. కొద్ది రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవటంతో ఇప్పుడిప్పుడే వారంతా రిలాక్స్ అవుతున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ వెంట వెళ్లేటప్పుడు లేని వణుకు.. బయటకు వచ్చిన తర్వాత మొదలైందని.. సుడి బాగుండి.. ఎవరికి ఏం కాలేదన్న మాట వినిపిస్తోంది. మొన్నటివరకు భయపడినోళ్లంతా ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్నారని తెలుస్తోంది.