Begin typing your search above and press return to search.

యాసంగిలో ఏం పంటలు వేయాలో చెప్పేసిన సీఎం కేసీఆర్

By:  Tupaki Desk   |   16 Oct 2020 10:45 AM IST
యాసంగిలో ఏం పంటలు వేయాలో చెప్పేసిన సీఎం కేసీఆర్
X
ఫలానా సీజన్లో ఫలానా పంట మాత్రమే వేయండంటూ ప్రభుత్వం చెప్పి మరీ వ్యవసాయం చేయించే అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా చెప్పాలి. మీఇష్టం వచ్చిన పంట వేయొద్దు. అలా వేస్తే నష్టపోతారు. పంటకు సరైన ధర రాదంటూ ప్రచారం చేస్తున్న కేసీఆర్ సర్కారు.. తాజాగా యాసంగి సీజన్లో ఏమేం పంటలు వేయాలన్న విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో వరి పంట వేయాలని.. మిగిలిన 15 లక్షల ఎకరాల్లో శనగ.. వేరుశనగ.. మిరప.. కూరగాయలు.. జొన్న.. నువ్వులు.. ఆవాలు.. సజ్జలు..కుసుములు.. పెసర్లు.. మినుములు.. పొద్దు తిరుగుడు మాత్రమేవేయాలని పేర్కొన్నారు. మక్కలు ఎట్టి పరిస్థితుల్లో పండిచొద్దని స్పష్టంచేశారు.

ప్రభుత్వం చెప్పిన పంటల్ని ఎవరు.. ఎంతమేర పండించాలో అధికారులు వెల్లడిస్తారు. క్లస్టర్ల వారీగా.. మండలాల వారీగా.. జిల్లాల వారీగా పంట సాగు లెక్కలతో కార్డులు జారీ చేస్తారు. ఒక సీజన్ లో విత్తనాలు వేయటం ముగిసిన వెంటనే.. మరో సీజన్ లో ఏ పంట వేయాలో వ్యవసాయ అధికారులు చెబుతారు. దానికి తగ్గట్లే రైతులు పంటలు వేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వం చెప్పిన పంట వేస్తే కలిగే లాభాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని.. ఇందుకు సంబంధించిన రైతు వేదికల్ని దసరా నాటికి దాదాపుగా పూర్తి అవుతాయని చెబుతున్నారు. మక్కల సాగు విషయంలో వద్దనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఒకవేళ మక్కల్ని పండిస్తే రూ.900 మించి వచ్చే అవకాశం లేదని.. అందుకే.. వాటి సాగు విషయంలో రైతులే నిర్ణయం తీసుకోవాలని చెబుతూనే.. వాటిని పండించకపోవటమే శ్రేయస్కరమని స్పష్టం చేస్తున్నారు. ఎంత ధర వచ్చినా ఫర్లేదు.. అంతకే అమ్ముకుంటామని డిసైడ్ అయితే మాత్రం మక్కలు పండించుకోవచ్చన్న మాట సీఎం కేసీఆర్ నోట రావటం గమనార్హం. మరి.. ఈ తీరుకు తెలంగాణ రైతాంగం స్పందన ఏమిటన్నది చూడాలి.