Begin typing your search above and press return to search.

బంగారు తెలంగాణ వదిలేసి బంగారు వాసాలమర్రి ఏంది కేసీఆర్?

By:  Tupaki Desk   |   23 Jun 2021 4:14 AM GMT
బంగారు తెలంగాణ వదిలేసి బంగారు వాసాలమర్రి ఏంది కేసీఆర్?
X
దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేయటమే తన లక్ష్యమని సగర్వంగా చెప్పుకోవటమే కాదు.. ఆ నినాదంతో తెలంగాణ ప్రజల మనసుల్ని దోచేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అలాంటి ఆయన.. తన నినాదాన్ని తానే దెబ్బేసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. కేసీఆర్ కు ఎప్పుడు ఎవరు ముద్దు వస్తారో.. ఎవరిని గుద్దతారో అస్సలు అర్థం కాదంటారు.

తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. కొద్ది నెలల క్రితం జిల్లా పర్యటన నుంచి ఫామ్ హౌస్ కు వెళుతూ.. మధ్యలో ఆగిన ఆయన.. తాను ఆగిన ఊరును వాసాలమర్రిగా తెలుసుకున్నారు. ఏమైందో ఏమో కానీ.. హటాత్తుగా ఆ ఊరిని తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మధ్యన ఆ ఊరి సర్పంచ్ కు ఫోన్ చేసి తాను ఈ నెల 22న వస్తున్నట్లు చెప్పి.. ఊరి మొత్తానికి భోజనంతో పాటు.. ఊళ్లో గ్రామసభను ఏర్పాటు చేద్దామని చెప్పటం.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేయటం జరిగిపోయాయి.

తాను చెప్పినట్లే..ఊరికి వెళ్లిన కేసీఆర్ అక్కడి గ్రామస్తులతో కలిసిపోయారు. సహపంక్తి భోజనం చేశారు. ఊరు వారిని పలుకరించి.. వారందరి సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా వాసాల మర్రి బిడ్డగా మారారు. నిజానికి అదేం తప్పు కాదు. కానీ.. వాసాలమర్రి గ్రామసభలో ఆయన నోటి నుంచి వచ్చిన మాట మాత్రం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టేదేనని చెప్పాలి.

తాను మరో 20 సార్లు వాసాలమర్రికి వస్తానని చెప్పిన ఆయన.. ఊరికి కేవలం ట్రాక్టర్లు ఇచ్చి వెళ్లిపోతే సరిపోదని.. ఊళ్లో ప్రత్యేకమైన పని జరగాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఏడాదిలో వాసాలమర్రిని బంగారు వాసాలమర్రి కావాలన్నారు. ఈ మాట దగ్గరే అందరి అభ్యంతరమంతా. ఎందుకంటే.. అప్పుడెప్పుడో బంగారు తెలంగాణ అభిలాషను ప్రకటించిన కేసీఆర్.. ఆ విషయాన్ని వదిలేసి.. వాసాలమర్రి లాంటి చిన్న గ్రామాన్ని బంగారుగా మార్చేస్తే.. మిగిలిన రాష్ట్రం మాటేమిటి?

రాష్ట్రాన్నే బంగారుతెలంగాణగా మార్చేస్తానన్నప్పుడు.. ఆ పని పూర్తి అయితే ఆటోమేటిక్ గా వాసాలమర్రి కూడా బంగారుగా మారుతుంది కదా? తెలంగాణ సాధించిన.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏడేళ్లకు మూడువేల కంటే తక్కువ ఉన్న గ్రామాన్ని ఏడాదిలో బంగారు వాసాలమర్రి చేస్తానని చెప్పటం ఏమిటి? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఎంత ఫ్లో అయితే మాత్రం.. తెలంగాణ ప్రజల్ని కట్టిపారేసిన ‘బంగారు’ మాటను అలా వాడేయటం ఏమిటి కేసీఆర్?