Begin typing your search above and press return to search.

ఒక పర్యటన.. బోలెడన్ని వరాలు.. సిద్దిపేట సుడి మామూలుగా లేదుగా?

By:  Tupaki Desk   |   11 Dec 2020 9:15 AM IST
ఒక పర్యటన.. బోలెడన్ని వరాలు.. సిద్దిపేట సుడి మామూలుగా లేదుగా?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్త సిత్రంగా ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఆయన సీఎం అయినప్పటికి.. కొన్ని ప్రాంతాల మీద ఆయన ప్రదర్శించే ప్రేమాభిమానాల్ని చూస్తే మిగిలిన వారంతా అసూయకు గురయ్యేలా ఆయన తీరు ఉంటుంది. రాష్ట్ర ప్రజలంతా కలిసి ఎన్నుకుంటే తాను ముఖ్యమంత్రి అయ్యానే తప్పించి.. ఒక సిద్దిపేట.. ఒక ఎర్రవెల్లి ప్రాంతాల్లోని వారి కారణంగా సీఎం కాలేదన్న వాస్తవాన్నిఆయన ఎప్పుడు గుర్తిస్తారో.

ఒకప్పుడు తాను ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం పట్ల ప్రేమాభిమానాలు ఉండటం తప్పు లేదు. అందుకని.. ఒక ప్రాంతం మీద చూపించే ప్రత్యేక ప్రేమాభిమానాలు గుదిబండగా మారతాయి. ఆ విషయం ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకుందన్నది మర్చిపోకూడదు. సిద్ధిపేటకు దగ్గర్లోనే ఉండే దుబ్బాకలో మౌలిక సదుపాయాలు శూన్యం. ఆ ఎన్నిక సందర్భంగా అందరి నోట్లో నానిన దుబ్బాక పాత బస్టాండ్ సెంటర్ ను చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. అంత దారుణంగా అక్కడ పరిస్థితి ఉందా? అన్నది ప్రశ్న.

నిజానికి దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి అభ్యర్థి ఎంపిక ఒకటైతే.. రెండోది సిద్ధిపేటకు.. దుబ్బాకకు మధ్య డెవలప్ మెంట్ లో అంతరం.. అక్కడి ప్రజలకు మంట పుట్టేలా చేసింది. తమ పార్టీ ఓడిన ప్రాంతాన్ని పట్టించుకోని కేసీఆర్.. మరికొన్ని ప్రాంతాల్లో అదే పనిగా వరాల్ని వరద పాటించే తీరు ప్రాంతాల మధ్య అంతరాల్ని పెంచేలా చేస్తాయన్నది మర్చిపోకూడదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ తర్వాత అయినా.. తన తీరును కేసీఆర్ మార్చుకుంటే బాగుండేది. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన వరాల్ని వింటే.. ఆయన నుంచి మార్పు ఆశించటం అత్యాశే అవుతుందనిపించక మానదు.

ఇప్పటికే పూర్తిస్థాయిలో డెవలప్ అయిన సిద్ధిపేటకు వరాల వర్షం కురిపించారు సీఎం కేసీఆర్. తన తాజా పర్యటన సందర్భంగా సిద్ధిపేటకు ఆయనిచ్చిన వరాల లిస్టు వింటే అసూయ కలుగక మానదు. సిద్ధిపేట చేసుకున్న పుణ్యం ఏమిటి? మేం చేసిన పాపం ఏమిటన్న ప్రశ్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల వారికి కలుగక మానదు. దాదాపు ఐదున్నర గంటల పాటు సాగిన కేసీఆర్ సిద్ధిపేట పర్యటనలో కేసీఆర్ ఇచ్చిన వరాల చిట్టా విప్పితే ఆశ్చర్యం తప్పదు. సాధ్యాసాధ్యాల్ని వదిలేసి కొన్ని హామీలు ఇచ్చినట్లుగా సీఎంను తప్పు పట్టేవారు లేకపోలేదు. అందులో ప్రధానమైన వరం.. సిద్ధిపేట శివారులో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పటం. ఆచరణకు సాధ్యం కాని ఈ వరం ఎలా ఇస్తారో ఆయనకే తెలియాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతోందని.. ఇప్పుడు హైదరాబాద్ కు అటువైపుగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉంది. మరో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు కావాలి. అది హైదరాబాద్ కు ఇటువైపుగా అంటే శామీర్ పేట ఇవతల రావొచ్చన్నారు. సిద్ధిపేటకు ఈశాన్యం కలిసి వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో సిద్ధిపేట పట్టణం అద్భుతంగా మారి అంతర్జాతీయ స్థాయికి చేరుతుందన్నారు.

వరాల విషయానికి వస్తే..
- నియోజకవర్గానికి మరో వెయ్యి డబుల్ బెడ్రూం ఇళ్లు
- ఆడిటోరియం నిర్మాణానికి రూ.50 కోట్లు
- ఇర్కోడు లిఫ్ట్ ఇరిగేషన్ కు రూ.80 కోట్లు
- సిద్ధిపేట నుంచి ఇల్లంతకుంటకు ఫోర్ లేన్ రోడ్డు
- 75 కి.మీ. రింగు రోడ్డు
- కోమటి చెరువు అభివృద్ధికి రూ.25 కోట్లు
- రంగనాయక సాగర్ పర్యాటక రంగం కోసం రూ.100కోట్లు
- డబుల్ బెడ్రూం ఇళ్లలో బస్తీ దవఖానా
- సిద్ధిపేటలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కోసం అనుమతి