Begin typing your search above and press return to search.

జహీరాబాద్ రైతుకు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

By:  Tupaki Desk   |   3 Jan 2021 11:00 AM IST
జహీరాబాద్ రైతుకు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు రోటీన్ కు భిన్నమని చెప్పాలి. ఉన్నట్లుండి రైతులకు ఫోన్ చేసి మాట్లలాడటం.. ఎంపిక చేసిన కొందరు రైతుల్ని నేరుగా ఫాంహౌస్ కు పిలపించుకొని వారితో మాట్లాడటం.. ఒకట్రెండు రోజులు ఉంచుకొని వారి నుంచి పలు వివరాలు సేకరించటం చేస్తుంటారు. తాజాగా సీఎం కేసీఆర్ జహీరాబాద్ కు చెందిన ఆలుగడ్డ రైతు నాగేశ్వర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. ఆయనేం మాట్లాడారు? ఫోన్ కాల్ లో వారి సంభాషణ ఎలా సాగిందన్న వివరాల్లోకి వెళితే..

కేసీఆర్‌: జహీరాబాద్‌ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో ఆలుగడ్డ పంట సాగు చేస్తున్నరు?

రైతు: సార్‌.. గతంలో 2500 ఎకరాల నుంచి 3000 ఎకరాల వరకు ఆలుగడ్డ పంట సాగు చేసేటోళ్లు. ఈ ఏడాది 1500 ఎకరాల నుంచి 2500 ఎకరాల వరకు సాగు చేస్తున్నరు.

కేసీఆర్: ఏ రకం ఆలుగడ్డ సాగు చేస్తరు.. పంట దిగుబడి ఎట్లున్నది?

రైతు: రైతులు అధికంగా 166 రకం ఆలుగడ్డ సాగు చేస్తరు.

కేసీఆర్: ఒక ఆలుగడ్డ చెట్టుకు ఎన్ని గడ్డలు వస్తాయి?

రైతు: ఒక చెట్టుకు సుమారు 8 నుంచి 10 గడ్డలు వస్తాయి.

కేసీఆర్: ఒక చెట్టుకు ఎన్ని కిలోల ఆలుగడ్డ దిగుబడి వస్తుంది?

రైతు: ఒక చెట్టుకు కిలో దాక దిగుబడి ఉంటుంది.

కేసీఆర్‌: ఎకరాకు ఆలుగడ్డ ఎన్ని బస్తాలు వేస్తారు?

రైతు: ఎకరాకు 16 బస్తాలు వేస్తాం సార్‌

కేసీఆర్‌: ఆలుగడ్డ వేసి ఎన్ని రోజులైతున్నది. పంట ఎట్లున్నది.. గడ్డలు వస్తున్నయా?

రైతు: ఒక చెట్టుకు పెద్ద సైజు గడ్డలు 9 వరకు వస్తున్నయి. ఎకరాకు 16 బస్తాల ఆలుగడ్డలు వేస్తే.. 80 రోజులకు 12 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.

కేసీఆర్‌: మార్కెట్‌లో ప్రస్తుతం ఆలుగడ్డ ధర ఎంత ఉన్నది?

రైతు: మార్కెట్‌లో ప్రస్తుతం ఆలుగడ్డ 10 కిలోలకు రూ. 180 నుంచి రూ.200 వరకు వస్తున్నది. జహీరాబాద్‌ ప్రాంతంలో రెండు రకాల భూములున్నయి. ఎర్ర నేల - నల్ల నేల భూముల్లో ఆలుగడ్డ సాగు చేస్తారు. ఎర్ర నేల భూమిలో సాగు చేసిన గడ్డకు ధర తక్కువ వస్తది. నల్లనేలలో సాగు చేసిన పంటకు ధర ఎక్కువ వస్తది.