Begin typing your search above and press return to search.

శుభవార్త చెప్పిన సీఎం .. ఇక పై 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ !

By:  Tupaki Desk   |   14 Sep 2020 4:30 PM GMT
శుభవార్త చెప్పిన సీఎం .. ఇక పై 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ !
X
ఇక పై రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాల‌యాల్లో అవినీతికి ఆస్కారం ఉండబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతికి ఆస్కార‌మే లేద‌ని తేల్చి చెప్పారు. సోమవారం (సెప్టెంబర్ 14) అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. గ‌త ప్ర‌భుత్వాలు వీఆర్వోల‌కు అన‌వ‌స‌ర అధికారాలు ఇవ్వ‌డంతో అరాచ‌కాల‌కు పాల్ప‌డ్డార‌ని చెప్పారు.రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమే అని, దీంతో పీటముడి పడిన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని వివరించారు. పలు చట్టాల సమాహారంగా రెవెన్యూ చట్టం కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఇకపై తహసీల్దార్లు అవినీతికి పాల్పడే అవకాశం ఉండదని చెప్పారు.

ధరణి పోర్టల్‌లో మార్పులకు తహసీల్దార్లకు అధికారం లేదని వెల్లడించారు. సబ్‌ రిజిస్ట్రార్లకు ఎలాంటి విచక్షణాధికారం లేదని సీఎం స్పష్టం చేశారు. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ధరణి పోర్టల్‌లో అప్‌డేట్‌ కాగానే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, ఆప్‌డేషన్‌ కాపీలు వస్తాయి. రెవెన్యూ కోర్టులు రద్దు చేశాం. వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లవచ్చు. కావాలని వివాదాలు పెట్టుకునే వారి కోసం ప్రభుత్వం సమయం వృథా చేయదు అని సీఎం కేసీఆర్ తెలిపారు. బ‌యోమెట్రిక్, ఐరిస్, ఆధార్‌, ఫోటోతో రిజిస్ర్టేష‌న్లు చేస్తామ‌న్నారు. ఈ వివ‌రాల‌న్నీ లేకుండా త‌హ‌సీల్దార్ల‌కు పోర్ట‌ల్ తెరుచుకోదు. ప‌క‌డ్బందీ, వ్యూహంతో పేద రైతుల హ‌క్కులు కాపాడుతామ‌న్నారు. రైతులు, ప్ర‌జ‌లకు లంచాలు ఇచ్చే బాధ త‌ప్పాల‌నేది ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని చెప్పారు.

రాష్ట్రంలో మొత్తం 60లక్షల 95వేల 134 మంది ప‌ట్టాదారులు ఉన్నార‌ని చెప్పారు. 2.5 ఎక‌రాల భూమి ఉన్న రైతులు 39లక్షల 52వేల 232 మంది ఉన్నార‌ని తెలిపారు. 2.5 నుంచి 3 ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 4లక్షల 70వేల 759 మంది, 3 నుంచి 5 ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 11లక్షల 08వేల 193 మంది, 5 నుంచి 7.5 ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 3లక్షల 49వేల 382 మంది, 7.5 నుంచి 10 ఎక‌రాల్లోపు ఉన్న రైతులు లక్షా 15వేల 916 మంది, 25 వేల ఎక‌రాల్లోపు ఉన్న రైతులు 6 వేల మంది ఉన్నారని సీఎం తెలిపారు.