Begin typing your search above and press return to search.

మేధావి జేపీని అన్నేసి మాటలు ఎలా అంటావ్ కేసీఆర్?

By:  Tupaki Desk   |   8 Aug 2019 10:08 AM GMT
మేధావి జేపీని అన్నేసి మాటలు ఎలా అంటావ్ కేసీఆర్?
X
తప్పును తప్పుగా.. ఒప్పును ఒప్పుగా ఎత్తి చూపిస్తూ.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే అతికొద్ది మంది తెలుగువారిలో లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ ఒకరని చెప్పక తప్పదు. ప్రాంతాలుగా తెలుగు రాష్ట్రం విడిపోయినప్పటికీ.. ప్రాంతాలకు అతీతంగా మాట్లాడటం.. విషయాల మీద పూర్తిస్థాయి అవగాహనతో పాటు.. అవనసరమైన నిందలు.. రాజకీయపరమైన స్వార్థంతో తొందరపడి వ్యాఖ్యలు చేయటం జేపీలో కనిపించవు. అయినప్పటికీ.. తన కలల ప్రాజెక్టును తప్పు పట్టిన వారు జేపీ అయినా.. మరెవరైనా సరే తనకు తోచినట్లుగా దుమ్ము దులపటం.. అవసరమైతే వారి మూలాల్ని టచ్ చేసి.. ఆంధ్రా పేరుతో సెంటిమెంట్ రాజేసేందుకు సైతం వెనుకాడని తీరును మరోసారి ప్రదర్శించటం తెలిసిందే.

తెలంగాణ ఉద్యమ సమయంలో తమకు అనుకూలంగా ఉన్న ఆంధ్రోళ్ల గురించి గొప్పగా చెప్పుకునే కేసీఆర్.. తన విధానాల్ని తప్పు పట్టినా.. తనపై విమర్శలు చేసినా వెంటనే వారి ప్రాంతీయతను ప్రశ్నించే తీరు అభ్యంతరకరంగా చెప్పాలి. తెలంగాణలో అప్పుడెప్పుడో వచ్చి స్థిరపడిన జేపీ.. చట్టబద్ధంగా తెలంగాణ పౌరుడు అయినప్పుడు.. ఆయన మూలాల్ని ఎలా ప్రశ్నిస్తారన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా వాళ్లు తెలంగాణ ప్రాజెక్టులోని తప్పుల్ని ఎత్తి చూపకూడదన్నట్లుగా కేసీఆర్ చేస్తున్న తాజా వ్యాఖ్యలపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కేసీఆర్ స్టాండ్ అదే అయినప్పుడు.. ఏపీకి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి చెందిన కేసీఆర్ సలహాలు.. సూచనలు ఎలా చేస్తారు?

తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తప్పు పట్టినంతనే.. ప్రశ్నించిన వారి మూలాల్ని ఎత్తి చూపే కేసీఆర్.. తాను ఏపీకి సలహాలు ఇవ్వటమంటే.. తెలంగాణ ప్రయోజనాలు తప్పించి.. ఏపీకి ఎలాంటి లాభం ఉండదన్న మాట చెబితే ఎంత దుర్మార్గంగా ఉంటుంది. నిజానికి ప్రాంతీయ భావనలు లేకుండా ప్రజలకు లాభం చేకూరేలా మాట్లాడి అతి కొద్ది మంది నేతల్లో జేపీ ఒకరు. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ ప్రభుత్వం ఈ మధ్యన తీసుకొచ్చిన మున్సిపల్ బిల్లును జేపీ మంచిదని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ సర్కారు తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని మెచ్చుకున్న జేపీకి సైతం ఆంధ్రా ముద్ర ఎలా వేస్తారన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు లోక్ సత్తా పరివారం.

38 ఏళ్ల క్రితం కాళేశ్వరం వద్ద ఒక నెల పాటు జేపీ గడిపారని.. కరీంనగర్ జిల్లాలో ట్రైనింగ్ తీసుకున్నారని.. ఆ ప్రాంతంలో ఆయనకున్న అనుబంధాన్ని వివరిస్తోంది లోక్ సత్తా. జేపీపై కేసీఆర్ చేసిన విమర్శల్ని తీవ్రంగా తప్పు పట్టిన లోక్ సత్తా.. ఒకవేళ జేపీకి ఆంధ్రా ఫీలింగ్ ఎక్కువగా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుఉద్యమంలో కీలకమైన 14ఎఫ్ ఆందోళనకు జేపీ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఎలా మర్చిపోతారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మంచి చేస్తే మంచిగా చేశారని.. తప్పు చేస్తే వాటిని ఎత్తి చూపించే తీరు జేపీకి ఉంటుందని.. మరే నేతలోనూ ఇలాంటి తీరు కనిపించదని లోక్ సత్తా పేర్కొంది. అనవసరంగా నోరు పారేసుకోవటం కాకుంటే.. జేపీ లాంటోడి మీద కూడా నిందలు వేయటం ఎందుకు కేసీఆర్ అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.