Begin typing your search above and press return to search.

ప్రగతిభవన్ లో అరుదైన సన్నివేశం!

By:  Tupaki Desk   |   22 March 2021 1:30 PM GMT
ప్రగతిభవన్ లో అరుదైన సన్నివేశం!
X
అరుదైన సీన్ కు ప్రగతిభవన్ వేదికైంది. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత కేసీఆరే కారణంగా చెప్పాలి. మిగిలిన రాజకీయ అధినేతలకు ఆయన భిన్నం. తనకు అత్యంత సన్నిహితుల్ని సైతం కలవకుండా.. వారు కోరినంతనే అపాయింట్ మెంట్ ఇవ్వకుండా తిప్పించే ఆయన.. మరికొన్ని సందర్భాల్లో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటారు. ఆయన తీరు ఎంత సిత్రంగా ఉంటుందనటానికి ఆయన సన్నిహితులు ఒక ఉదాహరణను చెబుతుంటారు. కేసీఆర్ కు జిగిరీ దోస్తుల్లో ఒక పెద్ద మనిషి.. తనకు అవసరం వచ్చి సీఎం కేసీఆర్ ను కలవాలని అనుకున్నారు. ఆయన అనుకోవాలే కానీ.. కేసీఆర్ అలా వెయిట్ చేస్తూ కూర్చుంటారన్నంత సన్నిహితుడు ఆయన. కానీ.. ఆయనకు అపాయింట్ మెంట్ దొరకలేదు. అది కూడా ఒకటో రెండో రోజులు కాదు.. దాదాపు పది రోజులపాటు.

దీంతో.. ఆయన తన వేదనను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. పదకొండో రోజు అనూహ్యంగా కేసీఆర్.. ఆయన ఇంటికే స్వయంగా వచ్చేశారు. షార్ట్ పిరియడ్ నోటీసులో.. సీఎంగారు ఇంటికి వస్తున్నారన్న సమాచారంతో ఆ సన్నిహితుడికి ఏమీ అర్థం కాని పరిస్థితి. ఆయన ఎప్పుడెలా వ్యవహరిస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పలేమనటానికి ఇదో ఉదాహరణ మాత్రమే.

సాధారణంగా ప్రగతి భవన్ కు వచ్చే వారిలో చాలామంది సీఎం కేసీఆర్ కు శాలువా కప్పుతారు. ఆయన స్వయంగా కప్పేది చాలా కొద్దిమందికి. అందునా.. వారు ప్రముఖులైతే మాత్రమే అలాంటి సీన్ ఉంటుంది. అందుకు భిన్నంగా తన పార్టీకి చెందిన.. తానిచ్చిన టికెట్ మీద గెలిచిన వచ్చిన ఎమ్మెల్సీ పల్లాకు శాలువా కప్పిన వైనం ఆసక్తికరంగా మారింది. సొంత పార్టీ నేతలకు శాలువా కప్పటం గడిచిన ఏడేళ్లలో ఎన్నిసార్లు చూసి ఉంటారు?

ఎప్పుడూ లేనిది ఈసారి ఎందుకలా అంటే.. దానికి కారణం లేకపోలేదు. ఇటు వాణీదేవి.. అటు పల్లా గెలుపు పార్టీకి ఎంత విలువైనదో కేసీఆర్ కు తెలియనిది కాదు. సరైన సమయంలో సరైన టానిక్ లాంటి విజయాన్ని ఇచ్చిన పల్లాకు శాలువా కప్పటం ద్వారా.. తానెంత ఖుషీగా ఉన్నాన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. శాలువా లాంటివి తాము కప్పటమే కానీ.. కప్పించుకునే సీన్ రాని పల్లా లాంటి వారి ఆనందానికి హద్దులే లేని పరిస్థితి. ఏమైనా.. పల్లాకు సీఎం కేసీఆర్ శాలువా కప్పిన సీన్ మాత్రం ప్రగతిభవన్ లో రేర్ సీన్ అని చెప్పక తప్పదు.