Begin typing your search above and press return to search.

అప్పుల్లో మెట్రో ..ఆదుకుంటాం అంటూ సీఎం హామీ

By:  Tupaki Desk   |   15 Sept 2021 2:44 PM IST
అప్పుల్లో మెట్రో ..ఆదుకుంటాం అంటూ సీఎం హామీ
X
కరోనా వైరస్ సమయంలో ప్రయాణికులు తగ్గి నష్టాల్లో కూరుకుపోయిన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ దిశగా ఏమేం అవకాశాలు ఉన్నాయో అన్వేషిస్తామని, మెట్రో రైలు తిరిగి గాడినపడేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. మెట్రో రైల్‌ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ అధికారులు మంగళవారం ప్రగతిభవన్‌ లో సీఎం కేసీఆర్‌ తో సమావేశమయ్యారు. కరోనా, లాక్‌ డౌన్లతో మెట్రోకు నష్టాలు, పేరుకుపోతున్న రుణాలు, వడ్డీల భారాన్ని వివరించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వల్ల అన్నిరంగాల తరహాలోనే మెట్రో రైల్‌ కూడా ఇబ్బందుల్లో పడిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

దినాదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగరానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, భవిష్యత్తులో మరింతగా విస్తరించాల్సి ఉందని చెప్పారు. అన్ని రంగాలను ఆదుకున్నట్టే హైదరాబాద్‌ మెట్రోను కూడా గాడిలో పెట్టడానికి తోడ్పడతామని హామీ ఇచ్చారు. ఎటువంటి విధానాలు అవలంబించడం ద్వారా మెట్రోకు మేలు చేయగలమో విశ్లేషిస్తామని, మెట్రో తిరిగి పుంజుకోవడంతోపాటు సేవల విస్తరణకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీనకి సంబంధించి మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నర్సింగ్‌ రావు, ఫైనాన్స్, పురపాలక శాఖల స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు రామకృష్ణారావు, అరవింద్‌ కుమార్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మెట్రో రైల్‌ను ఆదుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలపై అధ్యయనం చేసి, త్వరగా నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించారు.

హైదరాబాద్‌ మెట్రో రోజుకు రూ.కోటి నష్టంతో నడుస్తోంది. మూడు మార్గాల్లో 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉన్నా.. ప్రయాణికుల ఆదరణ అంతంతగానే ఉంది. తొలుత రూ.16 వేల కోట్ల అంచనాతో మెట్రో చేపట్టినా.. నిర్మాణం రెండేళ్లు ఆలస్యం కావటంతో వ్యయం 19 వేల కోట్లకు పెరిగింది. ఈ మేరకు పెరిగిన నిర్మాణ వ్యయాన్ని చెల్లించాలని మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రభుత్వాన్ని కోరింది. ఇక కరోనా కారణంగా రూ.300 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఎల్‌అండ్‌టీ చెప్తోంది.