Begin typing your search above and press return to search.

రైతుల కోసం కేసీఆర్ స్కీమ్ అదిరిపోయిందిగా

By:  Tupaki Desk   |   13 April 2017 1:32 PM GMT
రైతుల కోసం కేసీఆర్ స్కీమ్ అదిరిపోయిందిగా
X
తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. వ్యవసాయానికి ఉచితంగా ఎరువులను సరఫరా చేయనున్నట్లు ప్రకటించారు. రైతుల బాగు కోసం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్య‌మంత్రి కార్యాల‌యమైన జనహితలో రైతులతో సమావేశమైన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక ఏడాది నుంచి రైతులకు అవసరమయ్యే 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా సరఫరా చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఎరువుల సరఫరా కోసం వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. బడ్జెట్ ఆమోదం పొందిన వెంటనే తొలి నిధులు అన్నదాతలకే విడుదల చేస్తామని ప్రకటించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులకు ఉచితంగానే ఎరువులు సరఫరా చేస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఎకరానికి 2 దుక్కి మందు, 3 యూరియా బస్తాలను ఉచితంగా ఇస్తామన్నారు. వీటికయ్యే మొత్తం రూ. 4 వేలు వచ్చే ఏడాది మే నెలలో రైతుల బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు. `దుక్కి మందు - యూరియా - పొటాష్ ప్రభుత్వమే ఇస్తుంది.. పురుగుల మందు మీరే కొనుక్కోవాలి` అని రైతులకు సూచించారు. రాష్ర్టంలో 55 లక్షల మంది రైతులు ఉన్నారని, రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయంతో వీరందరికి లబ్ధి చేకూరుతుందని కేసీఆర్ తెలిపారు. రైతులకు కులం లేదని, భూమిని నమ్మి బతికే నిజాయితీపరులం మనమని కేసీఆర్‌ చెప్పారు. ప్రతి గ్రామంలో గ్రామ రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని, రైతు సంఘాల్లో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలన్నారు. `నిజాయితీగా గ్రామ రైతు సంఘాల జాబితాలు తయారు చేయాలి. వ్యవసాయానికి ఆధునిక టెక్నాలజీని జోడించాలి. యంత్రాలను విరివిగా వాడాలి` అని కేసీఆర్‌ చెప్పారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, రాష్ట్ర అభివృద్ధిపైనే ప్రధాన దృష్టి సారించామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరి సహకారంతో అద్భుతాలు సృష్టించామని తెలిపారు. చాలా కష్టపడి సాధించుకున్న రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలనే విషయంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఆ క్రమంలోనే అన్ని అడ్డంకులను అధిగమించామని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యుత్ కోతను అధిగమించాం... అద్భుతంగా పంటలు పండించుకోగలుగుతున్నామని స్పష్టం చేశారు. దేశంలోనే 21 శాతం ఆదాయం పెరిగిన రాష్ట్రంగా ఆవిర్భావించామని తెలిపారు. అనుకున్న విధంగా రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించి ఇస్తామని ఉద్ఘాటించారు. మేడిగడ్డ నుంచి శ్రీరాంసాగర్ కు వరకు నీరందిస్తామన్నారు. వానలు పడిన పడకపోయినా నిజాం సాగర్ కింది ఆయకట్టుకు సాగునీరందిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నుంచి 1700 టీఎంసీలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని చెప్పారు. నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు.

`గతంలో రాష్ర్ట రైతాంగం దెబ్బతింది. రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరువులను గత పాలకులు నాశనం చేశారు. చెరువులను బాగు చేస్తున్నాం. చెరువులను పునరుద్ధరించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఇక నుంచి ప్రతి రైతు తమ పంట పొలాల్లో ఏయే పంటలు పండుతాయో పరిశీలించాలి. క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలి. వాతావరణ పరిస్థితులు బట్టి ఏయే పంటలు ఎక్కడ పండుతాయో తెలుసుకోవాలి` అని కేసీఆర్ తెలిపారు. రాష్ర్టంలో ఇక కరెంట్ పోయే పరిస్థితి లేదని కేసీఆర్ తెలిపారు. రుణమాఫీతో రైతులు సంతోషంగా ఉన్నారని ఆయ‌న వివ‌రించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/