Begin typing your search above and press return to search.

ప్రత్యర్థులు లేని తెలంగాణలో కేసీఆర్ ప్రజాదరణ అంత తక్కువా?

By:  Tupaki Desk   |   3 Jun 2020 11:30 PM GMT
ప్రత్యర్థులు లేని తెలంగాణలో కేసీఆర్ ప్రజాదరణ అంత తక్కువా?
X
ప్రతిపక్షాలను పూచిక పుల్లగా తీసిపారేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాకిచ్చే సర్వే ఫలితం ఒకటి వెలువడింది. ప్రజా సమస్యలన్నవే తమ రాష్ట్రంలో లేవని తరచూ గొప్పలు చెప్పుకునే సారు.. తనకు తాను ఆత్మవిమర్శ చేసుకునేలా సర్వే ఫలితం వెలువడటం గమనార్హం. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండటమే కాదు.. ప్రజాదరణ మీద ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవటం.. నిఘా వర్గాల రిపోర్టులు తెప్పించుకోవటం అలవాటున్న కేసీఆర్.. తనకు తాను తిరుగులేని అధినేతగా తరచూ అభివర్ణించుకుంటారు.

అందుకు భిన్నంగా సీ ఓటర్ -ఐఏఎన్ఎస్ తాజా సర్వే ఉంది. మే చివర్లో జరిపిన ఈ సర్వేలో పాల్గొన్న వారు.. తమ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనపై తీర్పు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇందులో కేసీఆర్ కు పదహారో స్థానంలో నిలిచినట్లుగా తేల్చారు. ఆయనకు రాష్ట్రంలోని 54.26 శాతం ప్రజల మద్దతు మాత్రమే ఉందని తేల్చింది.

తన పాలన బ్రహ్మాండంగా చెప్పుకునే కేసీఆర్ కు తాజా ఫలితం కాస్త మింగుడు పడనిదిగా చెప్పాలి. రాష్ట్రంలో బలమైన రాజకీయ ప్రత్యర్థి లేని వేళలోనే ఇంత తక్కువగా ప్రజాదరణ ఉంటే..సరైన నాయకుడు ప్రత్యర్థిగా నిలిస్తే పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. మాయదారి రోగం కమ్మేస్తున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర సర్కారు తీరు బాగుందని.. కట్టడి చర్యల విషయంలో కేసీఆర్ నిర్ణయాలు భేషుగ్గా ఉన్నాయన్న వాదన సర్వత్రా వినిపిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పే వేళలో.. కేసీఆర్ కున్న ప్రజాదరణ కనిష్ఠంగా ఉండటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. మరీ.. ఫలితం ఎందుకిలా వచ్చిందన్న విషయంపై గులాబీ దండు అలెర్టు కావాల్సిన అవసరం ఉంది.