Begin typing your search above and press return to search.

దటీజ్ జగన్..మరో హామీని నెరవేర్చిన ఏపీ సీఎం

By:  Tupaki Desk   |   3 Jun 2019 1:08 PM GMT
దటీజ్ జగన్..మరో హామీని నెరవేర్చిన ఏపీ సీఎం
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి స్పీడు పెంచేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే పాలన దృష్టి సారించిన ఆయన.. అందుకు అనుగుణంగా పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రస్తుత ఆర్థిక, సామాజిక పరిమైన పరిస్థితులను తెలుసుకునేందుకు అన్ని శాఖల అధికారులతో విడుతల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం వైద్య - ఆరోగ్యశాఖపై ఆయన సమీక్ష జరిపారు. ఈ శాఖకు సంబంధించిన అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన ఏపీ సీఎం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ప్రజాసంకల్పయాత్ర సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన ఓ హామీని నెరవేర్చారు. దీంతో సంబంధిత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పాదయాత్ర చేస్తున్న సమయంలో తమకు జీతాలు సరిపోవడం లేదని, ప్రభుత్వం తమను చిన్న చూపు చూస్తోందని తన వద్దకు వచ్చి మొర పెట్టుకున్న ఆశా వర్కర్లకు వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్ల జీతాలను రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు జగన్ ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాదు, దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం కూడా పెట్టేశారు. దీంతో వారి జీతం ఏకంగా రూ. 7 వేలు పెరిగినట్లైంది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల ఆశా వర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీని వెంటనే తీర్చిన సీఎం అంటూ కితాబిస్తున్నారు. జీతాలు పెంచినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఆశా వర్కర్ల సంఘం నేతలు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఇదిలాఉండగా - ఎంతో ప్రాముఖ్యం కలిగిన వైద్య - ఆరోగ్యశాఖలో భారీ మార్పులు తీసుకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - ఆంబులెన్స్‌ ల స్థితిగతులు - సిబ్బంది పనితీరు - పోస్టుల భర్తీ - ఆర్థిక అవసరాలు - మౌలిక అభివృద్ధిపై 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించారు. దీనితో పాటు చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ‘‘ఎన్టీఆర్ వైద్యసేవ’’ను ‘‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’’గా మార్చాలని అధికారులకు సూచించారు. వైద్య పరికరాలు - మందులు - మౌలిక సౌకర్యాలు - టెండరింగ్ విధానాలను పునఃసమీక్షించడంతో పాటు.. నకిలీ మందులు - నాణ్యత లేని ఔషదాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే తమ ధ్యేయమని చెప్పారు.